రైల్వే అధికారుల కీలక నిర్ణయం.. రైల్వే స్టేషన్‌లలో ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.50
Railway Increase Platform Ticket Price. ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లోని కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 3 March 2021 5:24 AM GMTదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిపోతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక మహారాష్ట్రలో అయితే కరోనా గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ప్రతి రోజు 8 వేలకుపైగా పాజిటి్వ్ కేసులు నమోదు కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు మరింత కఠినతరం చేసింది. ఇక పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో రైల్వేస్టేషన్‌లలో రద్దీని తగ్గించుకునేందుకు ప్లాట్ ఫాం టికెట్ ధరను 10 నుంచి ఏకంగా 50 రూపాయలకు పెంచేశారు.
ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లోని కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జనం అధిక రద్దీని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్, లోక్‌మాన్ తిలక్ టెర్మినల్‌తో పాటు పొరుగున ఉన్న ఠానే, కల్యాణ్, పాన్‌వెల్, భీవాండీ రోడ్ రైల్వే స్టేషన్‌లో పెంచిన ఈ ధరలు అమలు చేయనున్నట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో శివాజీ సుతార్ పేర్కొన్నారు.
కాగా, పెంచిన ప్లాట్ ఫాం టికెట్ ధరలు మార్చి 1 నుంచి జూన్ 15వ తేదీ వరకు అమలులో ఉంటాయని ఆయన వెల్లడించారు. వేసవి ప్రయాణాల సందర్భంగా ఆయా స్టేషన్‌ల వద్ద అధిక రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ముంబై మహానగరంలో ఇప్పటి వరకు 3.25 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11,400 మంది మరణించారు. ఇక దేశంలో అత్యధిక కోవిడ్ కేసులు, మరణాలు ఉన్న జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదు అవున్నాయి. దీంతో ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. కరోనా కట్టడికి ఆంక్షలు కఠినతరం చేశారు అధికారులు. ఇక ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుండటంతో మళ్లీ కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే ముంబై నగరంలో మాస్క్ ధరించని వారికి భారీగానే జరిమానా విధిస్తున్నారు