'కేరళ మినీ పాకిస్థాన్.. అందుకే రాహుల్-ప్రియాంక గెలిచారు'.. బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే 'మినీ పాకిస్థాన్' ప్రకటనపై రాజకీయ దుమారం చెలరేగింది.
By Medi Samrat Published on 30 Dec 2024 4:16 PM ISTమహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే 'మినీ పాకిస్థాన్' ప్రకటనపై రాజకీయ దుమారం చెలరేగింది. రాణే వ్యాఖ్యల తర్వాత ప్రతిపక్షాలన్నీ మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. విపక్షాల దాడి తర్వాత రాణే ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్ర ఫిషరీస్ మంత్రి నితీష్ రాణే ఒక ప్రసంగంలో.. కేరళను మినీ పాకిస్థాన్‌తో పోల్చారు.. కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ దీని వల్లే పార్లమెంటు సభ్యులు అయ్యారని అన్నారు.
పూణెలోని పురందర్ తాలూకాలో జరిగిన ర్యాలీలో రాణే మాట్లాడుతూ.. కేరళ ఒక మినీ పాకిస్తాన్.. అందుకే రాహుల్ గాంధీ, అతని సోదరి అక్కడి నుండి ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఉగ్రవాదులందరూ ఆయనకు ఓటు వేస్తారు. ఇది నిజం.. తన వెంట ఉగ్రవాదులను తీసుకెళ్లి ఎంపీ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
శివ ప్రతాప్ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే కుమారుడు రాణే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రకటనపై రాజకీయ దుమారం చెలరేగిన తర్వాత వెనక్కి తగ్గిన రాణే.. కేరళ భారతదేశంలో భాగమని అన్నారు. కేవలం కేరళ, పాకిస్థాన్ పరిస్థితులను మాత్రమే పోల్చి చూస్తున్నానని అన్నారు. పాకిస్థాన్‌లో హిందువుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. మన దేశం హిందూ దేశంగా ఉండాలని కోరుకుంటున్నామని రాణే అన్నారు. 'హిందువులను' అన్ని విధాలా కాపాడాలని అన్నారు.
దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోందే పాటిల్ స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను టార్గెట్ చేశారు. కేబినెట్‌లో రాణే కొనసాగింపుపై కాంగ్రెస్ నేత ప్రశ్నలు సంధించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే రాణే పని అని మండిపడ్డారు.