ఆ అంశంపై మాట్లాడితే లోక్‌సభలో రాహుల్, రాజ్యసభలో ఖర్గే మైక్‌లు ఆఫ్ చేస్తున్నారు : కాంగ్రెస్

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నీట్‌ అంశాన్ని లేవనెత్తిన స‌మ‌యంలో ఆయన మైక్ ఆఫ్‌ అయిందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

By Medi Samrat  Published on  28 Jun 2024 9:06 AM GMT
ఆ అంశంపై మాట్లాడితే లోక్‌సభలో రాహుల్, రాజ్యసభలో ఖర్గే మైక్‌లు ఆఫ్ చేస్తున్నారు : కాంగ్రెస్

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నీట్‌ అంశాన్ని లేవనెత్తిన స‌మ‌యంలో ఆయన మైక్ ఆఫ్‌ అయిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే మైక్ కూడా ఆఫ్ అయిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది నియంతృత్వం అని కాంగ్రెస్ నాయ‌కులు అన్నారు. తీవ్రమైన సమస్యలపై మాట్లాడుతున్నప్పుడు మైక్‌ను ఆఫ్ చేయడం వంటి చిన్నచిన్న పనులు చేస్తూ యువత గొంతును అణిచివేసేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్‌లో రాసింది.

రాజ్యసభలో కూడా ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మైక్ స్విచాఫ్ చేశారని కాంగ్రెస్ మరో ట్వీట్‌లో ఆరోపించింది. 'పేపర్ లీక్ విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉంది, ఇప్పుడు పేపర్ లీక్‌పై లేవనెత్తిన గొంతులను కూడా అణచివేయాలని చూస్తోంది' అని ట్వీట్‌లో పేర్కొంది.

కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా మాట్లాడుతూ.. 'నిరంతరం జరుగుతున్న పేపర్ లీకేజీల వల్ల దేశ యువత భవిష్యత్తు నాశనమైపోతోంది. పేపర్ లీక్ కేసులు ఎక్కువగా హర్యానాలో కనిపిస్తున్నాయి. నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. ఈ అంశంపై చర్చించాలని కోరగా.. సభలో ఈ అంశం ప్రస్తావనకు రావడంతో మైకులు ఆఫ్‌ అయ్యాయి. దీనిపై చర్చ జరగాలని కోరుతున్నామ‌న్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని.. వాటిని త్వరగా పరిష్కరించాలని కాంగ్రెస్ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ అంశంపై చర్చకు అనుమతించాలి.. అందుకే మేము వాయిదా తీర్మానం ఇచ్చాము. అయితే ఈ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మన ప్రతిపక్ష నేతను ఒక్క నిమిషం కూడా మాట్లాడనివ్వడం లేతు.. ఆయన మైక్ ఆఫ్ చేస్తున్నారు. ప్రభుత్వం పాత పద్ధతిలోనే నియంతృత్వ పాలన సాగిస్తోందని.. దీని వల్ల మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.

Next Story