67 రోజులు..6,700 కి.మీ.. రాహుల్‌ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’

'భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర' 7 రోజులు పాటు 6,700 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుందని కాంగ్రెస్ వెల్లడించింది.

By Srikanth Gundamalla  Published on  14 Jan 2024 2:15 PM IST
rahul gandhi, bharat jodo nyay yatra, congress,

67 రోజులు..6,700 కి.మీ.. రాహుల్‌ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ గతంలో చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన మరో పాదయాత్ర చేపడుతున్నారు. అదే 'భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర'. నేడు మణిపూర్‌ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ యాత్ర మొత్తం 15 రాష్ట్రాలు, 100 లోక్‌సభ స్థానాలు.. 110 జిల్లాల మీదుగా సాగనుంది. 67 రోజులు పాటు 6,700 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుందని కాంగ్రెస్ వెల్లడించింది. అలాగే 337 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందని చెప్పింది.

లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న పాదయాత్ర కావడంతో.. దీనిని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఈ యాత్ర ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది. గతంలో జోడో యాత్ర చేపట్టిన సమయంలో రాహుల్‌ పాదయాత్రకు విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ రాహుల్‌గాంధీ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. మరోసారి ఇప్పుడు బారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర కూడా అలానే సాగనుంది. అలాగే నరేంద్ర మోదీ పదేళ్ల అన్యాయ్‌ కాల్‌కి వ్యతిరేకంగా యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.

ఈశాన్య రాష్ట్రంలో మొదలవుతున్న రాహుల్‌గాంధీ యాత్ర మార్చి 20వ తేదీన మహారాష్ట్రలో ముగియనుంది. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ఎక్కువ భాగం ఉత్తర్‌ ప్రదేశ్‌లో కొనసాగనుంది. యూపీలోని 20 జిల్లా మీదుగా 1,074 కిలోమీటర్ల మేర 11 రోజులు యాత్ర ఉంటుంది. జార్ఖండ్, అస్సాంలో 8 రోజలు, మధ్యప్రదేశ్‌లో 7 రోజుల పాటు భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సాగుతుంది. ముఖ్యంగా ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో రాహుల్‌ యాత్ర కొనసాగనుంది. ఆ తర్వాత బీహార్‌లోని ఏడు జిల్లాలు, జార్ఖండ్‌లో 13 జిల్లాల్లో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర కొనసాగనుందని కాంగ్రెస్ తెలిపింది.


Next Story