రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఉన్న అనర్హత వేటుని లోక్‌సభ సచివాలయం ఎత్తివేసింది.

By Srikanth Gundamalla  Published on  7 Aug 2023 6:09 AM GMT
Rahul Gandhi,  MP, Back to loksabha, Congress ,

 రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఉన్న అనర్హత వేటుని లోక్‌సభ సచివాలయం ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. లోక్‌సభ సభ్యత్వాన్ని మళ్లీ పునరుద్ధరించినట్లు పేర్కొంది. దాంతో.. రాహుల్‌గాంధీ మళ్లీ పార్లమెంట్‌లో అడుగు పెట్టనున్నారు. తాజా ఉత్తర్వులతో కాంగ్రెస్‌ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మోదీ ఇంటి పేరుని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని సూరత్‌ కోర్టులో రాహుల్‌గాంధీపై కేసు నమోదు అయ్యింది. అయితే.. కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దాంతో.. ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఆయన ఎంపీగా అర్హతను కోల్పోయినట్లు గతంలో లోక్‌సభ సచివాలయం పేర్కొంది. అయితే.. ఇదే కేసుపై రాహుల్‌గాంధీ గుజరాత్‌ హైకోర్టులో కూడా అప్పీల్‌ చేశారు. కానీ.. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. కిందికోర్టు ఇచ్చిన తీర్పుని గుజరాత్‌ హైకోర్టు సమర్ధించింది. దాంతో.. మరోసారి రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

రాహుల్‌గాంధీ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం రాహుల్‌గాంధీకి సానుకూలంగా స్పందించింది. ఆయనకు ఊరట లభించింది. సూరత్‌ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ప్రజాజీవితంలో ఉన్నవారు మాట్లాడేప్పుడు జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా రాహుల్‌కు సూచించింది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్పందించిన లోక్‌సభ సెక్రటరియెట్‌... ఆయనపై ఉన్న అనర్హతను తొలగించింది. రాహుల్‌గాంధీ మళ్లీ పార్లమెంట్‌కు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. దాంతో.. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేరళలోని వయనాయ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రాహుల్‌గాంధీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.


Next Story