అల‌ర్ట్‌.. మారిన పాఠ‌శాలల‌ వేళ‌లు.. ఉద‌యం 10 గంట‌ల‌కు బ‌డి

Punjab schools to open at 10am due to dense fog.పంజాబ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 10 గంటలకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Dec 2022 3:09 PM IST
అల‌ర్ట్‌.. మారిన పాఠ‌శాలల‌ వేళ‌లు.. ఉద‌యం 10 గంట‌ల‌కు బ‌డి

పంజాబ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 10 గంటలకు తెరవబడతాయని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. ఉద‌యం పూట ద‌ట్ట‌మైన పొగ మంచు ఉండ‌డం వ‌ల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

గ‌త కొద్ది రోజులుగా పంజాబ్ రాష్ట్రంలో ఉద‌యం ద‌ట్ట‌మైన పొగ మంచు క‌మ్ముకుంటోంది. ఫ‌లితంగా ఎదురుగా ఉన్న వ్య‌క్తి కూడా క‌నిపించ‌డం లేదు. దీనికి తోడు చ‌లి కూడా వ‌ణికిస్తోంది. అత్య‌ల్పంగా బటిండాలో 3.4 డిగ్రీల సెల్సియ‌స్‌గా న‌మోదైంది. అమృత్‌సర్‌లో 6.8 డిగ్రీలు, లూథియానాలో 8.1 డిగ్రీలు, ఫిరోజ్‌పూర్‌లో 6.3 డిగ్రీలు, పఠాన్‌కోట్‌లో 5.8 డిగ్రీలు, గురుదాస్‌పూర్‌లో 4.8 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. దీంతో ఉద‌య‌మే ఆఫీసుల‌కు, పాఠ‌శాల‌ల‌కు వెళ్లే విద్యార్థులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు అంటే జ‌న‌వ‌రి 21 వ‌ర‌కు రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌లు ఉద‌యం 10 గంట‌ల నుంచి ప్రారంభం అవుతాయి. అయితే.. పాఠ‌శాల‌ల ముగింపు స‌మ‌యంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు.

"రాష్ట్రంలో దట్టమైన పొగమంచు కారణంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం భద్రత దృష్ట్యా డిసెంబర్ 21 నుండి జనవరి 21 వరకు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన మరియు ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 10 గంటలకు తెరవబడతాయి. ముగింపు సమయం మునుపటి మాదిరిగానే ఉంటుంది" అని మన్ భగవంత్ మాన్ ట్వీట్ చేశారు.

మ‌రో నాలుగైదు రోజుల పాటు పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రంలో తీవ్రమైన చ‌లిగాలులు వీస్తాయ‌ని, ద‌ట్ట‌మైన పొగ‌మంచు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Next Story