పరీక్షల రద్దుకు మూడు రాష్ట్రాలు ఓకే.. !
Punjab and Tripura Also Cancel Class 12 Physical Exams.కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు అన్ని
By తోట వంశీ కుమార్ Published on 21 Jun 2021 3:54 PM ISTకరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు అన్ని మూతపడిన విషయం తెలిసిందే. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారు. అయితే.. పరీక్షలు నిర్వహించాలనుకునే సమయంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిండంతో చాలా రాష్ట్రాల్లో పదవతరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయగా.. నాలుగు రాష్ట్రాలు మాత్రం వాయిదా వేసాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీం కోర్టు జూన్ 17వ తేదీన పరీక్షలు రద్దు చేయని పంజాబ్, అస్సాం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
12వ తరగతి పరీక్షల విషయంలో 28 రాష్ట్రాల్లో.. 18 రాష్ట్రాలు రద్దు చేశాయి. 6 రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించగా, 4 రాష్ట్రాలు రద్దు చేయలేదు. కేరళ 11 తరగతి పరీక్షలు రద్దు చేయకపోవడంతో ఆ రాష్ట్రానికి కూడా సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. కాగా.. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. అస్సాం, పంజాబ్, త్రిపుర రాష్ట్రాలు కూడా పరీక్షలు రద్దు చేస్తామని వెల్లడించాయి. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే. రేపటి విచారణలో కోర్టుకు ఏపీ ప్రభుత్వం తమ సమాధానం చెప్పే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టెన్త్, ఇంటర్ సెకండ్ పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెబుతూనే వస్తున్నారు. ఇక జులై నెలలో పది, ఇంటరు పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని ఆదిమూలపు సురేష్ ఇటీవల వెల్లడించారు. సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం రేపు సుప్రీం కోర్టుకు విన్నవించే అవకాశం ఉంది.