శుక్రవారమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.. ఇంతలో కరోనా
Puducherry CM N Rangasamy tests positive for Covid; to be treated in Chennai. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి కరోనా బారిన పడ్డారు.
By Medi Samrat Published on 10 May 2021 4:21 AM GMT
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి కరోనా బారిన పడ్డారు. ఆదివారం నాడు ఆయనకు చేసిన పరీక్షల్లో కరోనాగా నిర్ధారణ అయింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి సిబ్బంది ఈ విషయాన్ని మీడియాకు తెలిపింది. ఇందిరా గాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆయనకు పరీక్షలు నిర్వహించగా అందులో ఆయనకు కరోనా పాజిటివ్ గా వచ్చింది. వైరస్ బారిన పడ్డ రంగసామి చెన్నై లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. రంగసామి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉందని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు. రంగసామి శుక్రవారం నాడే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
రంగసామి చేత లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. పుదుచ్చేరి రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 16 స్థానాల్లో పదింటిని గెలుచుకుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ మిత్రపక్షం బీజేపీ తొమ్మిది స్ధానాల్లో పోటీ చేయగా ఆరు చోట్ల విజయం సాధించింది. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా ఎన్డీయే కూటమి 16 స్థానాలు సాధించింది. మరో ఆరుగురు స్వతంత్రులు సభకు ఎన్నికయ్యారు. వారంతా రంగస్వామి మద్దతుదారులే కావడంతో ముఖ్యమంత్రి పీఠం రంగసామి సొంతం అయింది.