కరోనా కట్టడి విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఢిల్లీ సీఎం.. మిగిలిన వాళ్లు కూడా..!
Protests, Public Gatherings Prohibited Due To Covid Surge. భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..!
By Medi Samrat
కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చేవారికి ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో ర్యాండమ్ టెస్టులు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా రెండో దశ కొనసాగుతుండగా, ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. హోలీ, షాబ్ - ఈ- బారాత్, నవరాత్రి ఉత్సవాలను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిషేధిస్తున్నట్టు స్పష్టం చేసింది. మార్కెట్లు, మాల్స్ తదితర చోట్ల మాస్క్ లు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరని పేర్కొంది. ప్రైవేటు బస్సులు నిలిపి ఉంచే పలు చోట్ల కూడా ర్యాండమ్ టెస్ట్ లను నిర్వహించనున్నామని, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.
బహిరంగ నిరసనలను, సమావేశాలను ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. మెట్రోలు, మాల్స్, సినిమా థియేటర్ల కారణంగానే కరోనా కేసులు అధికమవుతూ ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాంతాల్లో కూడా కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలని యాజమాన్యాలకు సూచించారు.