ఎర్ర కోటపై రైతన్న జెండా
Protesting farmers deviate from the designated route, hoist flag at Red Fort. రైతులు ఎర్రకోట ప్రాంగణంలో జెండా ఎగురవేసి ఆందోళన కొనసాగిస్తున్నారు.
By Medi Samrat Published on 26 Jan 2021 10:19 AM GMTతమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన రైతులు 72వ గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట లోకి దూసుకెళ్లారు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత రెండు నెలలుగా రైతులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికపై తమ ఉద్యమ జెండాను ఎగురవేశారు. బారికేడ్లు, లాఠీలు, టియర్ గ్యాస్ ఆందోళనల మధ్య ట్రాక్టర్ పరేడ్ సాగింది. ఎట్టకేలకు వీరు ఎర్రకోటను చేరుకున్నారు. రైతులు, రైతు సంఘాల నాయకుల నినాదాలతో ఎర్రకోట పరిసరాలు మార్మోగాయి. రైతులు ఎర్రకోట ప్రాంగణంలో జెండా ఎగురవేసి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎర్రకోటపై ప్రధాని జెండా ఎగురవేసే స్తంభం నుంచే తమ జెండాను కూడా ఎగురవేశారు. ఎర్రకోట పరిసరాల్లో ఎక్కడ చూసినా ట్రాక్టర్లు, వాటిపై రైతులే దర్శనమిస్తున్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్లతో దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టారు. రిపబ్లిక్ డే సందర్భంగా వేలాది ట్రాక్టర్లతో రైతులు చేపట్టిన కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. సెంట్రల్ ఢిల్లీలోకి ఆందోళనకారులు చొచ్చుకురావడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు ట్రాక్టర్ల పరేడ్‌ను నిర్వహించడానికి అనుమతి తీసుకున్నారు. అనుకున్న సమయానికి కంటే ముందుగానే ప్రారంభించారు. మరోవైపు రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు జరుగుతుండడంతో.. రైతుల్ని ఆపేందుకు పోలీసులు యత్నించారు. పెద్ద సంఖ్యలో రైతులు వస్తుండడంతో ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మొహరించారు. ర్యాలీ ప్రారంభానికి ఇంకా సమయం ఉండడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు వారితో ఘర్షణకు దిగారు. బారికేడ్లను తొలగించారు. సింఘు, ఘాజీపూర్ సరిహద్దు వద్ద కూడా ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ముకర్భా ప్రాంతంలో బారికేడ్లను తొలగించే క్రమంలో ఆందోళనకారులు పోలీసుల వాహనంపైకి ఎక్కారు. దీంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. రైతులను నిలువరించేందుకు వాటర్ క్యానన్లు కూడా ప్రయోగించారు. ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణలో భద్రతాబలగాల వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. రాజ్‌పథ్‌లో గణతంత్ర పరేడ్ ముగియడంతో.. పోలీసులు వెనక్కి తగ్గి ర్యాలీ ముందుకు సాగేందుకు అనుమతించారు.
ఢిల్లీ సరిహద్దులో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో బారికేడ్లను తొలగించి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. సెంట్రల్ ఢిల్లీ ఐటీవో ప్రాంతంలో రైతులు ఒక్కసారిగా కర్రలతో పోలీసుల వెంట పడడంతో పోలీసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. బారికేడ్లను తెంచుకుని రైతులు ముందుకు చొచ్చుకెళ్లారు. అక్కడున్న పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. అదే ప్రాంతంలో అడ్డుగా నిలిపిన ఓ బస్సును కూడా రైతులు ధ్వంసం చేశారు. ఓ గ్రూపుకు చెందిన రైతులు ఓ పోలీసుపై దాడి చేస్తుండడంతో మరికొందరు రైతులు పోలీసును రక్షించి పక్కకు పంపించారు.