గవర్నర్ బంగ్లా ముందు గొర్రెలతో నిరసన.. ఎక్కడంటే

Protester comes with sheep in front of Raj Bhavan. బుధవారం ఉదయం కొందరు వ్యక్తులు కోల్‌కతాలోని గవర్నర్ బంగ్లా ముందు గొర్రెలతో నిరసన చేపట్టారు

By Medi Samrat
Published on : 19 May 2021 9:51 PM IST

sheeps

నారదా స్కాం మారోమారు పశ్చిమ బెంగాల్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు విచారణ కోసం ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మదన్‌ మిశ్రా, మాజీ మంత్రి సోవన్‌ చటర్జీని సీబీఐ సోమవారం అరెస్టు చేసి నగరంలోని నిజాం ప్యాలెస్‌లో ఉన్న తమ కార్యాలయానికి తరలించడంతో వివాదం మరింత ముదిరింది. సీబీఐ అధికారులకు గవర్నర్ అనుమతులు లేకుండా అరెస్టులు జరిగవనీ, అలాగే ఇందులో స్పీకర్ హస్తం కూడా ఉందని టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో బుధవారం ఉదయం కొందరు వ్యక్తులు కోల్‌కతాలోని గవర్నర్ బంగ్లా ముందు గొర్రెలతో నిరసన చేపట్టారు. ఈ ఘటన గవర్నర్‌ ధన్‌కర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మెయిన్ గేటు ఎదుట గొర్రెలతో నిరసన చేస్తుంటే కోల్‌కతా పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గొర్రెల నిరసన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నా ఇలాంటి చర్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే రాజ్‌భవన్ ముందు గొర్రెలతో నిరసన తెలియజేసింది తామేనని కోల్‌కతా నాగరిక్ మన్సా ప్రతినిధులు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఆక్సిజ‌న్ కొర‌త వెంటాడుతోంది. కొవిడ్ రోగుల‌కు స‌రిప‌డ బెడ్లు లేవు. రోగులు చ‌నిపోతున్నారు. ఇలాంటి సమయంలో గవర్నర్ ఇతర అంశాలపై ద్రుష్టి పెట్టడం తమను బాధించిందని, అందుకే అలా గొర్రెల మందతో నిరసన తెలిపామని చెప్పారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు.తన పుట్టినరోజు నాడు ఇలా జరగడం గవర్నర్ జగ‌దీప్ ధ‌న‌ఖ‌ర్ ను చాలా మనస్తాపానికి గురి చేసింది. ఈ విషయంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పోలీసుల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆదేశించారు.



Next Story