పార్లమెంటులో మరో 'గాంధీ'.. నేడు ప్రమాణ స్వీకారం

కేరళలోని వాయనాడ్‌ నుంచి లోక్‌సభ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు పార్లమెంట్‌ సభ్యురాలిగా ప్రమాణం చేయనున్నారు.

By Kalasani Durgapraveen  Published on  28 Nov 2024 4:40 AM GMT
పార్లమెంటులో మరో గాంధీ.. నేడు ప్రమాణ స్వీకారం

కేరళలోని వాయనాడ్‌ నుంచి లోక్‌సభ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు పార్లమెంట్‌ సభ్యురాలిగా ప్రమాణం చేయనున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ రెండు స్థానాల నుండి గెలుపొందారు. దీంతో వ‌య‌నాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ప్రియాంక ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. ఎన్నికల అరంగేట్రంలో ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకు పైగా ఓట్ల‌ భారీ తేడాతో సీటును గెలుచుకున్నారు. ఇది 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆమె సోదరుడి విన్నింగ్‌ మార్జిన్ కంటే ఎక్కువ కావ‌డం విశేషం.

పార్లమెంటులోని ఏ సభలోనైనా తమ కుటుంబంలో కనీసం ఒక సభ్యుడైనా ఉన్న ఎంపీల జాబితాలో ప్రియాంక గాంధీ చేరనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంక లోక్‌సభలో ఉన్నారు. అంటే పార్లమెంటు ఎగువ సభలో తల్లి, దిగువ సభలో కొడుకు, కూతురు కూర్చుంటారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ ఇద్దరూ లోక్‌సభ సభ్యులు. లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ గెలుపొందగా, ఆయన భార్య ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి స్థానం నుంచి ఎన్నికయ్యారు. అఖిలేష్ యాదవ్ బంధువు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ స్థానం నుంచి గెలుపొందగా.. రెండో బంధువు ధర్మేంద్ర యాదవ్ బదౌన్ నుంచి గెలుపొందారు. లాలూ యాదవ్ కుటుంబంతో అఖిలేష్ యాదవ్ కుటుంబానికి కూడా అనుబంధం ఉంది.

పప్పు యాదవ్ బీహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా 23,000 ఓట్లకు పైగా గెలుపొందారు. ఆయన భార్య రంజిత్ రంజన్ ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆమె 2022లో సభకు ఎన్నికయ్యారు. శరద్ పవార్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, 2014లో సభకు ఎన్నికయ్యారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు.

Next Story