మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతుంది: ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  12 April 2024 1:02 PM IST
prime minister  modi, nda government, congress,

మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతుంది: ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీల విమర్శలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిందని చెప్పారు. అధికారంలో ఉండగా ఎన్డీఏ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసమే పనిచేసిందని చెప్పారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం అంతకుముందు దశాబ్దాల కాలంపాటు ఒక కుటుంబాన్ని మాత్రమే బలోపేతం చేసుకుందని విమర్శించారు. దేశం కోసం కాంగ్రెస్‌ హయాంలో చేసిందేమీ లేదని విమర్శించారు. ఇక ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో మూడోసారి కూడా ఎన్డీఏ ఘన విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ దుర్వినియోగం చేస్తుందని ప్రతిపక్షలు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. అయితే.. వాటికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవడంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. కేవలం రాజకీయ నాయకులపైనే దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పడం ఏమాత్రం సరికాదని అన్నారు. దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో 3శాతం వాటికే రాజకీయాలతో సంబంధం ఉందనీ.. 97 శాతం అవినీతి అధికారులు, నేరగాళ్లకు సంబంధించినవే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ఇక ఈ పదేళ్ల పాటు తాము అవినీతి నిర్మూలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు పలు చర్యలు తీసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. రూ.22.75 లక్షల కోట్లను తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నామని ప్రధాని మోదీ అన్నారు. 2014 ముందు ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.25వేల కోట్లు ఉండగా.. గత పదేళ్లలో మొత్తం రూ.లక్ష కోట్లకు పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

Next Story