ప్రతికూల వాతావరణం.. 126 కి.మీ ప్రధాని మోదీ రోడ్డు ప్రయాణం

ఢిల్లీ నుంచి రాంచీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

By Srikanth Gundamalla  Published on  15 Sept 2024 5:23 PM IST
ప్రతికూల వాతావరణం.. 126 కి.మీ ప్రధాని మోదీ రోడ్డు ప్రయాణం

ఢిల్లీ నుంచి రాంచీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దాంతో.. విమాన ప్రయాణం సరికాదని అధికారులు చెప్పారు. దాంతో.. ప్రధాని నరేంద్ర మోదీ తన టూర్‌ను వాయిదా వేసుకోలేదు. దాదాపు 126 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించారు. జెంషెడ్‌పుర్‌ చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని.. కీలక ప్రసంగం చేశారు. తాను ప్రజల వద్దకు చేరుకోవడాన్ని భారీ వర్షమే కాదు.. ఏదీ ఆపలేదని వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది చివరిలో ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో..అక్కడి గోపాల్‌ మైదాన్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారీ వర్షంతో పాటు ఏ అవరోధాలు మీ వద్దకు రాకుండా అడ్డుకోలేవు అని అన్నారు. మీ ఆప్యాయత నా హృదయాన్ని తాకిందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విపక్షాలు కుట్రలు చేసినా.. ప్రజలు మాత్రం కూటమి ప్రభుత్వానికే పట్టం కట్టారని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ప్రభుత్వంపైనా ప్రధాని విమర్శలు చేశారు. జార్ఖండ్‌లో జేఎంఎం ప్రభుత్వం వనరులను దోచుకుంటోందని అన్నారు. గతంలో తాము అధికారంలో ఉండగా.. జిల్లా ఖనిజ నిధి ద్వారా హక్కులకు భరోసా ఇచ్చామన్నారు. అధికారం దాహంతో ఉన్న జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్‌ జార్ఖండ్ రాష్ట్రానికి శత్రువుల్లా మారాయంటూ మండిపడ్డారు. జార్ఖండ్‌లో ప్రస్తుతం చొరబాట్లు ఎక్కువగా ఉన్ఆనయన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను రాష్ట్ర జనాభాలోకి మారుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

జార్ఖండ్‌లో కాంగ్రెస్-జేఎంఎం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని మోదీ ఆరోపించారు. గనులు, ఖనిజాలు, సైనిక భూములను దోపిడీ చేసిన జేఎంఎం పాలనకు చరమగీతం పాడాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జేఎంఎం ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకుని.. తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందని అన్నారు. జేఎంఎంకు ప్రజలు ఈసారి బుద్ధి చెప్పాలని.. బీజేపీని ఆదరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

Next Story