బీజేపీ మేనిఫెస్టో కోసం యువత ఆలోచనలను కోరిన ప్రధాని మోదీ
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 12:00 PM GMTబీజేపీ మేనిఫెస్టో కోసం యువత ఆలోచనలను కోరిన ప్రధాని మోదీ
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో ఆయా పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమి ప్రజల్లోకి వెళ్తోంది. అందులో భాగంగానే రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారు. ఇక ఎన్నికలంటే ప్రధాన పాత్ర పోషించేది మేనిఫెస్టోనే. ఆ మేనిఫెస్టోపైనే ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ మేనిఫెస్టో కోసం దేశ యువత తమ ఆలోచనలను పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు దేశ యువత నమో యాప్‌లో అభిప్రాయాలను పంచుకోవాలని ఆహ్వానిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొత్త ఓటర్స్ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు ప్రధాని మోదీ. అయితే..బీజేపీ మేనిఫెస్టో కోసం ఆలోచనలు.. సలహాలు అందించిన వారిలో కొందరిని మోదీ భవిష్యత్‌లో కలవనున్నట్లు చెప్పారు. నమో యాప్‌లో తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు. యువత తమ వినూత్న ఆలోచనలను narendramodi.in వెబ్‌సైట్‌లో కూడా షేర్ చేయవచ్చని ప్రధాని మోదీ అన్నారు.
అలాగే ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు మోదీ. ఓటు వేయడం ద్వారా సమాజంలో మార్పు ఉంటుందని.. ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే ప్రభుత్వం, ప్రజల మధ్య సహకారం పెరుగుతుందని చెప్పారు. ప్రజా భాగస్వామ్యంతోనే బీజేపీ మేనిఫెస్టో రూపొందిస్తే భవిష్యత్తు సరైన దిశగా నడుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.