సొరంగం నుంచి బయటపడ్డ కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ
ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో సొరంగంలో 17 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులు ఎట్టకేలకు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 29 Nov 2023 11:20 AM ISTసొరంగం నుంచి బయటపడ్డ కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ
ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో సొరంగంలో 17 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులు ఎట్టకేలకు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కార్మికులు క్షేమంగా బయటపడటంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బాధిత కార్మికులకు ఫోన్ చేసి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగమై.. కార్మికులను కాపాడటంలో ముఖ్యపాత్ర పోషించిన ఆర్మీ (రిటైర్డ్) అధికారి వీకే సింగ్ సేవలను ప్రధాని కొనియాడారు. మరోవైపు రెండువారాలకు పైగా గడిచినా ధైర్యంగా ఆశలు కోల్పోకుండా నిరీక్షించిన కార్మికుల తెగువను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. కార్మికుల ధైర్యం, సహనం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు.
ఈ మేరకు ప్రధానితో ఫోన్లో మాట్లాడిన కార్మికులు.. సొరంగంలో ఒక్క క్షణం కూడా తాము భయపడలేదని చెప్పారు. తామంతా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లమే కానీ.. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారమని చెప్పారు. కలిసి భోజనం చేసేవాళ్లమని.. రాత్రి భోజనం తర్వాత 2.5 కిలోమీటర్లు సొరంగం లోపలికి నడిచి వెళ్తామని కార్మికులు ప్రధానితో చెప్పారు. ఉదయం లేవగానే యోగా చేసేవాళ్లమంటూ మరో కార్మికుడు ప్రధానికి చెప్పాడు. వీకే సింగ్ కార్మికులను బయటకు తీసుకువడానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఎంతో నిరీక్షణ తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సవాళ్లు ఎదరైన సమయంలో కుటుంబాలన్నీ చూపించిన సహనం, ధైర్యాన్ని తప్పకుండా అభినందించాలని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
కార్మికులు సొరంగంలో ఇరుక్కుపోయినప్పుడు అనేక మార్గాలను అనుసరించినా రెండువారాల పాటు బయటకు తీసుకురాలేకపోయారు. కానీ ర్యాట్ హోల్ మైనింగ్‌తో ఒక్కరోజు లోపే ఫలితం వచ్చింది. వాస్తవానికి అశాస్త్రీయం, సురక్షితం కాదంటూ ఈ పద్ధతిపై 2014లో ఎన్జీటీ నిషేధం విధించింది.