తెలంగాణలో రెండ్రోజులు పర్యటనకు వస్తోన్న ప్రధాని మోదీ
దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దాంతో.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 8:43 AM GMTతెలంగాణలో రెండ్రోజులు పర్యటనకు వస్తోన్న ప్రధాని మోదీ
దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దాంతో.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తోంది. మోదీ మేనియా.. అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఆయుధాలుగా ఎన్నికలకు సిద్ధం అవుతోంది. మరోవైపు ఇండియా కూటమి ఈసారి మోదీ సర్కార్‌ను గద్దె దించాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా ఆయా రాష్ట్రాల్లో పర్యటనల్లో పాల్గొంటున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ 370 సీట్లు అని.. ఎలాగైనా ప్రజలు తాము అనుకున్నన్ని సీట్లను గెలిపిస్తారని ప్రధాని మోదీ దీమా వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి విజయఢంకా మోగిస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తున్నారు. కొద్దికాలంగా తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందనే చెప్పాలి. 2019 ఎన్నికలతో పోలిస్తే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగింది. దాంతో.. తెలంగాణలో అధిక లోక్‌సభ స్థానాలను గెలిచేందుకు సమయాత్తం అవుతోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు కూడా రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే బహిరంగ సభలో పాల్గొని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మార్చి 4, 5 తేదీల్లో రెండ్రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ లో పర్యటిస్తారు. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగనుంది. ఇందుకు గాను రాష్ట్ర బీజేపీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక అమిత్‌షా 4వ తేదీన తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా.. తాజాగా మోదీ షెడ్యూల్ ఖరారు కావడంతో హోంమంత్రి టూర్ క్యాన్సిల్ అయ్యింది. మార్చి 4వ తేదీన ప్రధాని మోదీ ఆదిలాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం ఆదిలాబాద్‌లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మార్చి 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు వచ్చి అక్కడే బస చేస్తారు. ఆ తర్వాత రోజు మార్చి 5వ తేదీన ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్తారు. అక్కడ కూడా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.