ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఫైర్

ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  25 Jun 2024 7:00 AM GMT
prime minister modi, tweet,  congress, political ,

ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఫైర్

ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఎమర్జెన్సీ విధించాలని తీసుకున్న నిర్ణయానికి ఇవాళ్టితో 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదిక ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీని దేశ ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని హస్తం పార్టీ చేస్తున్న ఆరోపణలు అన్నీ అబద్ధమని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి దేశాన్నే జైలుకు మార్చేసిందంటూ ఎమర్జెన్సీ రోజులను ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఎమర్జెన్సీ విధించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వారికి రాజ్యాంగంపై ఇప్పుడు ప్రేమను వ్యక్త పరిచే హక్కు లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదిక పలు పోస్టు పెట్టారు.

అప్పుడు ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని ఎదురించిన మహనీయులందరికీ నివాళులు అర్పించే రోజు ఇదంటూ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను, ప్రతి భారతీయుడూ గౌరవించే రాజ్యాంగాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందంటూ మండిపడ్డారు. కేవలం అదికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను విస్మరించి దేశం మొత్తాన్ని జైల్లో బంధించిందినీ రాసుకొచ్చారు. ఆ పార్టీని వ్యతిరేకించిన వారిని పట్టుకుని హింసించారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని దారుణమైన విధానాలను అమల్లోకి తెచ్చారంటూ కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీలో ఎమర్జెన్సీ విధించిన మనస్తత్వం ఇప్పటికీ ఉందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఫెడర్ వ్యవస్థను నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్సే అంటూ మండిపడ్డారు. చాలా సందర్భాల్లో ఆర్టికల్ 356ను విధించి.. పత్రికా స్వేచ్ఛను నాశనం చేసే బిల్లులను తెచ్చారని అన్నారు. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని కాంగ్రెస్ ఉల్లంఘించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కాంగ్రెస్ చేసిన పనులను.. అన్యాయం.. అవినీతిని ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. అందుకే పదేపదే ఆ పార్టీని తిరస్కరిస్తున్నారని ట్వీట్ చేశారు.


Next Story