టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు నటిస్తున్నాయి: ప్రధాని మోదీ
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 26 April 2024 8:56 AM GMTటీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు నటిస్తున్నాయి: ప్రధాని మోదీ
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. మాల్దాలో గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌లోని టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు ఘర్షణ పడుతున్నట్లు నటిస్తున్నాయని చెప్పారు. కానీ.. ఈ రెండు పార్టీల స్వభావం, సిద్ధాంతం ఒక్కటే అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విషయాన్ని బెంగాల్ ప్రజలు గుర్తించాలని పేర్కొన్నారు.
తాము ఈ పదేళ్ల పాలనలో దేశ భద్రత కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోదీ అన్నారు. తాము తీసుకున్న నిర్ణయాలను తిరగదోడాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయని అన్నారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని ఇండియా కూటి కోరుకుంటోందని చెప్పారు. మరోవైపు సీఏఏను రద్దు చేస్తామని టీఎంసీ చెబుతోందని ప్రధాని మోదీ అన్నారు. పేదల ఆస్తులను దర్యాప్తు చేస్తామని కాంగ్రెస్ వెల్లడించిందని చెప్పారు. వారు విదేశాల నుంచి ఎక్స్‌రే మిషన్‌ను తీసుకొచ్చి దేశంలో అందరి మీద ఎక్స్‌రే చేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్షించారు. తద్వారా మీ నగలు, ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుంటారని అన్నారు. ఇక వాటిలో కొంత భాగం తమ ఓటు బ్యాంకుకి పంచాలని ఇండియా కూటమి భావిస్తోందని.. కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పిచ్చిగా మాట్లాడుతుంటే.. ఆ పార్టీ గురించి బెంగాల్‌లోని టీఎంసీ ఒక్క మాట కూడా అనడం లేదని మోదీ అన్నారు. ఎందుకు మౌనంగా ఉంటుందో అర్థం కావట్లేదన్నారు. ప్రజల భూములను టీఎంసీ బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులకు పంచేస్తే.. కాంగ్రెస్ మీ ఆస్తులను తమ ఓటు బ్యాంకుకి పంచడం గురించి మాట్లాడుతోందని అన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరంతరం లూటీ చేస్తూనే ఉంటోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.