గుజరాత్‌లోని పంచ్‌మహల్ జిల్లాలో గోద్రా రైల్వే స్టేషన్‌లో రైలు బోగి దహనం చేసిన కేసులో పోలీసులు కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 2002లో జరిగిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రఫిక్ హుస్సేన్‌ను పోలీసులు పట్టుకున్నారు. 19 ఏళ్ల కిందట కరసేవకుల సజీవదహనం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు. ఇన్ని రోజులు తలదాచుకుంటున్న రఫిక్‌ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.
పంచ్‌మహల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్‌లో కరసేకులతో నిండిన ట్రైన్‌కు నిప్పటించారు. అయితే గోద్రా ఘటనకు కుట్రపన్నిన కోర్ గ్రూప్‌లో రఫీక్ హుస్సేన్ సభ్యుడు. అయితే పోలీసులకు లభించిన సమాచారం ఆధారంగా రైల్వే స్టేషన్ సమీపంలో మాటు వేసి పట్టుకున్నారు. రఫీక్ హుస్సేన్ ఘటన జరిగిన రోజు రైలు కంపార్టమెంట్ తగులబెట్టేందుకు పెట్రోల్ సిద్ధం చేశాడని, ఈ కుట్రలో రఫీక్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనలో 59 మంది కరసేవకులు మృతి చెందారు. అతనిపై ఇప్పటికే పలు కేసులు కూడా నమోదై ఉన్నాయి.
అయితే ఘటన జరిగిన సమయంలో రఫీక్ అదే స్టేషన్‌లో కూలిగా పని చేస్తున్నాడు. రైలు రాగానే రఫీక్ దానిపై రాళ్లు రువ్వి, పెట్రోల్ చల్లాడు. అనంతరం రఫీక్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తలదాచుకుంటూ వచ్చాడు. ఇటీవలే రఫీక్ అతను గోద్రాకు కుటుంబం సహా వచ్చి ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు మాటు వేసిన పోలీసులు రఫీక్‌ను పట్టుకుని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను రాబడుతున్నారు పోలీసులు.