రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. జులై 18న ఎన్నిక
Presidential elections to be held on July 18th.రాష్ట్రపతి ఎన్నికకు గురువారం షెడ్యూల్ విడుదలైంది. జులై 18న
By తోట వంశీ కుమార్ Published on 9 Jun 2022 3:40 PM ISTరాష్ట్రపతి ఎన్నికకు గురువారం షెడ్యూల్ విడుదలైంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 15న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు. 18న ఓటింగ్ ను నిర్వహించనుండగా.. జులై 21 కౌంటింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు.
Voting for Presidential elections to be held on 18th July, counting of votes on 21st July: Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/bTvawdiE9I
— ANI (@ANI) June 9, 2022
రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఎలా జరుగుతుందంటే..?
రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, డిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులుంటారు. వీరు ఓటు హక్కు ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని నామినేటెడ్ సభ్యులు, రాష్ట్రాల శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు.
ఓటింగ్.. బ్యాలట్ పేపర్ విధానంలో జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యే లకు విప్ జారీ చేయకూడదు. ఓటు వేయడానికి, గైర్హాజరు కావడానికి ప్రజాపత్రినిధులకు స్వేచ్ఛ ఉంటుంది.
2017 నాటి లెక్కల ప్రకారం ఎలక్టోరల్ కాలేజీలో 4,809 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 4,033 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు ఉన్నారు.