రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అంబాలా వైమానిక దళం స్టేషన్ నుండి రాఫెల్ ఫైటర్ జెట్‌లో గగనతలంలో విహరించారు. ఈ కార్యక్రమంలో భారత వైమానిక దళ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌పై క్షిపణుల వర్షం కురిపించిన అంబాలా వాయుస్థావరం నుంచి రాష్ట్రపతి ఫ్రాన్స్ తయారీ సూపర్ జెట్‌లో ప్రయాణించారు. అంతకుముందు రాష్ట్రపతి ఎయిర్‌బేస్‌లో భారత వాయుసేన గౌరవ వందనం స్వీకరించారు. ఆపరేషన్ సిందూర్‌కు 6 నెలల తర్వాత రాష్ట్రపతి యుద్ధవిమానంలో విహరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ద్రౌపదీ ముర్ము యుద్ధవిమానంలో విహరించడం ఇది రెండోసారి. 2023లో ఆమె రష్యన్ తయారీ సుఖోయ్-30 ఫైటర్ జెట్‌లో గగనవిహారం చేశారు. 2006లో ఏపీజే అబ్దుల్‌కలామ్ రాష్ట్రపతిగా తొలిసారి సుఖోయ్-30 యుద్ధవిమానంలో సూపర్‌సోనిక్ వేగంతో గగనవిహారం చేశారు. ఆ తర్వాత 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కూడా అదే ఫైటర్‌లో పయనించారు.