Prashant Kishor reiterates prediction on BJP's seats in WB. ప్రశాంత్ కిషోర్.. తాజాగా ఆయన పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టాలని తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
By Medi Samrat Published on 1 March 2021 8:09 AM GMT
ప్రశాంత్ కిషోర్.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని చూడడానికి ఆయన చేసిన కృషి కూడా ఉందని అంటుంటారు. తాజాగా ఆయన పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టాలని తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో బీజేపీని ఎదుర్కోవడం కోసం రూపొందించే వ్యూహరచనలో కిషోర్ కంపెనీ ఐ-ప్యాక్(ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) అధికార టీఎంసీకి సహాయపడుతోంది.
సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పలు ట్వీట్లు పెడుతూ వస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం కోసం జరిగే కీలక ఎన్నికల పోరాటాల్లో ఒకటి పశ్చిమ బెంగాల్‌లో జరగనుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ రాష్ట్రంలో మార్చి 27 నుంచి జరిగే శాసనసభ ఎన్నికలను ప్రస్తావిస్తూ 'సొంత బిడ్డను మాత్రమే కోరుకుంటున్న బెంగాల్' అనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ప్రధాన నినాదాన్ని ట్విటర్‌లో షేర్ చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి రూపొందించిన నినాదం అది.
బెంగాల్ ప్రజలు తమ తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, మే 2న తన చివరి ట్వీట్ కోసం వేచిచూడండని కిషోర్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలలో బెంగాల్‌లో బీజేపీ రెండంకెలకు మించి స్థానాలను గెలుచుకుంటే తాను ట్విటర్ నుంచి తప్పుకుంటానని గత డిసెంబర్ 21న కిషోర్ ట్వీట్ చేశారు. ఇప్పటికీ ఆ మాటలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. బెంగాల్‌లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ ఈసారి పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలని అనుకుంటూ ఉంది. కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీకి అవకాశం లేదని తేల్చి చెబుతూ ఉన్నారు. ఆయన కాన్ఫిడెన్స్ మాత్రం సూపర్ అని అందరూ అనుకుంటూ ఉన్నారు.