అనుమతి లేకుండా బ్రాండ్‌ వాడారని.. కాంగ్రెస్‌ పార్టీకి ఫోన్‌పే వార్నింగ్

అనుమతి లేకుండా బ్రాండ్‌ వాడినందుకు కాంగ్రెస్‌ పార్టీకి డిజిటల్‌ ట్రాన్సాక్షన్‌ సంస్థ ఫోన్‌పే వార్నింగ్‌ ఇచ్చింది.

By అంజి  Published on  29 Jun 2023 9:40 AM GMT
Poster War, CM Shivraj Singh Chouhan, Phonepe, Congress party

అనుమతి లేకుండా బ్రాండ్‌ వాడారని.. కాంగ్రెస్‌ పార్టీకి ఫోన్‌పే వార్నింగ్

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నం.. కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. అనుమతి లేకుండా బ్రాండ్‌ వాడినందుకు కాంగ్రెస్‌ పార్టీకి డిజిటల్‌ ట్రాన్సాక్షన్‌ సంస్థ ఫోన్‌పే వార్నింగ్‌ ఇచ్చింది. తమ పర్మిషన్‌ లేకుండా తమ బ్రాండ్‌ను ఎలా వాడుకుంటారంటూ ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సంవత్సరం చివరలో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్‌ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. బీజేపీ ప్రభుత్వంలో అవినీతి భారీ స్థాయికి చేరిందంటూ పోస్టర్‌ వార్‌ని ప్రారంభించింది కాంగ్రెస్‌. దానికి ప్రతి దాడికి బీజేపీ సైతం పోస్టర్‌ వార్‌ మొదలు పెట్టి కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తోంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ సీఎం కమల్‌ నాథ్‌పై 'వాంటెడ్‌ కరప్షన్ నాథ్‌' అని రాసి ఉన్న పోస్టర్లు భోపాల్‌లో కనిపించాయి. ఈ పోస్టర్లు బీజేపీ పనేనని కాంగ్రెస్‌ ఫైర్‌ అయ్యింది. అయితే బీజేపీ మాత్రం.. ఈ విషయంలో తమ ప్రమేయం లేదని, కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాట ఫలితమే ఇది అని బీజేపీ చెప్పింది. ఈ ఘటన తర్వాత మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కరప్షన్‌కి పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత చౌహాన్‌పై పోస్టర్లు వెలిశాయి. 50 శాతం కమిషన్లు తీసుకుంటున్నట్లు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌పై ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ పోస్టర్లపై డిజిటల్‌ ట్రాన్సాక్షన్‌ సంస్థ ఫోన్‌పే లోగోతో కూడి క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ దగ్గర సీఎం చౌహాన్‌ ఫొటోను ముద్రించారు.

ఈ పోస్టర్లలో ఫోన్‌ పే బ్రాండ్ పేరు, లోగో కూడా ఉన్నాయి. ఈ పోస్టర్ల ఫొటోలను రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. 50శాతం పొందండి, ఫోన్‌లో పనిపూర్తి చేయండి అంటూ.. మధ్యప్రదేశ్ ప్రజలకు తెలుసు.. 50శాతం కమీషన్ తీసుకునే వారిని వారు గుర్తిస్తారు అని ట్వీట్ చేసింది. అయితే ఈ పోస్టర్లపై పర్మిషన్‌ లేకుండా ఫోన్‌ పే లోగోను వాడుకోవటంపై ఆ సంస్థ స్పందించింది. ట్విటర్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ.. తమ బ్రాండ్ లోగోను పర్మిషన్‌ లేకుండా మూడవ వ్యక్తి వాడుకోవటం సరికాదు అని ఫోన్ పే తెలిపింది. రాజకీయాలకైనా, రాజకీయేతర విషయాలకు కూడా లోగోను ఇలా వాడవద్దు అని తన ట్వీట్ లో చెప్పింది. అనుమతి లేకుండా లోగోను వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Next Story