దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది మరణించారు. కాగా.. చనిపోయిన వారి అస్థికలను నదిలో కలపడం భారతదేశంలో ఉన్న ఆచారాలలో ఒకటి. దీనిని హిందూవులు పవిత్రమైనదిగా భావిస్తుంటారు. అయితే.. కరోనా భయం, లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి కారణంగా తమ కుటుంబీల అస్థికలు నదిలో కలిపేందుకు చాలా మందికి అవకాశం ఉండడం లేదు. ఇందుకోసం పోస్టల్ శాఖ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడి నుంచైనా.. స్పీడ్ పోస్ట్ ద్వారా అస్థికలు పంపితే.. వారణాసి, ప్రయాగ్ రాజ్, హరిద్వార్, గయలోని గంగానదిలో కలిపేందుకు ఏర్పాటు చేసింది.
వారణాసిలోని ఓమ్ దివ్య దర్శన్ అనే సామాజిక సేవాసంస్థ సంయుక్తంగా స్పీడ్ పోస్ట్ విధానాన్ని ప్రారంభించింది. దేశంలో ఎక్కడి నుంచైనా అస్థికలను స్పీడ్ పోస్ట్ ద్వారా ఓమ్ దివ్య దర్శన్ కార్యాలయానికి పంపించవచ్చు. వీటిని ఎన్జీఓ సిబ్బంది వారణాసి, ప్రయాగ్రాజ్, హరిద్వార్, గయాలో శాస్త్రోక్తంగా నిమజ్జనం చేస్తారు. అయితే స్పీడ్ పోస్ట్ చేసేవారు ముందుగా ఓమ్ దివ్య దర్శన్ పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాలని వారణాసి పోస్ట్మాస్టర్ జనరల్ కృష్ణ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత ఓ బాటిల్‌లో గంగానది నీటిని ఆయా కుటుంబ సభ్యులకు పోస్ట్ ద్వారా పంపిస్తామని తెలిపారు.