జ‌నాభా పెర‌గ‌డానికి క‌రెంట్ కోత‌లే కార‌ణ‌మ‌ట‌.. కేంద్ర మంత్రి ఇలా అన్నారేంటి..?

జ‌నాభా పెర‌గ‌డానికి కాంగ్రెస్ హ‌యాంలో క‌రెంట్ కోత‌లే కార‌ణ‌మ‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 March 2023 10:27 AM IST
Union minister Pralhad Joshi, Power cuts,

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి

జ‌నాభా పెర‌గ‌డానికి కాంగ్రెస్ హ‌యాంలో క‌రెంట్ కోత‌లే కార‌ణ‌మ‌ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వివాదాస్పద ప్రకటన చేశారు. గురువారం హాసన్ జిల్లా బెల్లూరులో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో జోషి మాట్లాడుతూ కాంగ్రెస్ హ‌యాంలో క‌రెంట్ కోతలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, క‌రెంట్ లేని కార‌ణంగా జ‌నాభా పెరిగింద‌న్నారు. క‌ర్ణాట‌క రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తే ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించే క్ర‌మంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

"ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఉచిత కరెంటు ఇస్తామంటే నమ్ముతారా? వారి కాలంలో కరెంటు ఇవ్వలేదు. గ్రామాల్లో ఎప్పుడూ కరెంటు ఉండేది కాదు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము (బీజేపీ) 24 గంటల కరెంటు ఇవ్వగలుగుతున్నాం.వాళ్లు (కాంగ్రెస్‌) తక్కువ కరెంటు ఇచ్చేవారు కాబట్టి మన జనాభా పెరిగింది." అని ప్రహ్లాద్‌ జోషి అన్నారు.

దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. క‌రెంట్ కోత‌ల‌పై కాంగ్రెస్ ను విమ‌ర్శించ‌డం బాగానే ఉంది అయితే.. దాన్ని దేశ జ‌నాభాతో లింక్ చేయ‌డమే కాస్త అతిగా అనిపిస్తుంద‌ని కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌హ్లాద్ చేసిన ఈ వ్యాఖ్య‌లను తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ న‌వ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు.

క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఈ ఏడాది మే నెల‌లో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. దీంతో అక్క‌డ రాజ‌కీయ పార్టీలు అన్ని త‌మ ప్ర‌చారాన్ని ప్రారంభించాయి. ఓట‌ర్ల‌ను ఆకట్టుకునేందుకు ఇప్ప‌టి నుంచే హామీలు ఇస్తున్నాయి. ఈ క్ర‌మంలో వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని కర్ణాటక కాంగ్రెస్ హామీ ఇచ్చింది. జనవరిలో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర 'ప్రజాధ్వని యాత్ర' సందర్భంగా కాంగ్రెస్ ఈ ప్రకటన చేసింది.

Next Story