బ్రిజ్ భూషణ్ ఇంటికి చేరుకున్న పోలీసులు
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి ఢిల్లీ పోలీసులు
By అంజి Published on 6 Jun 2023 12:00 PM ISTబ్రిజ్ భూషణ్ ఇంటికి చేరుకున్న పోలీసులు
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి ఢిల్లీ పోలీసులు వెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఉన్న ఆయన ఇంట్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఇంట్లో ఉన్న సుమారు 12 మంది నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. ఆ స్టేట్మెంట్లను రికార్డు చేశారు. వాంగ్మూలం ఇచ్చిన వారి పేర్లను, అడ్రస్, ఐడీ కార్డులను తీసుకున్నారు. బ్రిజ్‌కు అనుకూలంగా ఉన్న అనేక మంది మద్దతుదారులను కూడా ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. బ్రిజ్‌పై లైంగిక వేధింపుల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పటి వరకు 137 మంది నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేసింది.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్లు హోంమంత్రి అమిత్ షాను కలిశారు. శనివారం అర్ధరాత్రి ఆ సమావేశం అమిత్ షా నివాసంలో దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశానికి పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్, సత్యవర్త్ కడియన్ తదితరులు హాజరయ్యారు. మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆరోపణలు వచ్చాయి. అతడు చేసిన దారుణాలపై నిష్పాక్షిక విచారణ జరిపి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఎలాంటి వివక్ష లేకుండా దర్యాప్తు చేస్తామని రెజ్లర్లకు అమిత్ షా హామీ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ పై ఆరోపణలు వచ్చిన విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చట్టం తన పని తాను చేసుకుపోతుందని అమిత్ షా చెప్పారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే ఆత్మహత్య చేసుకోడానికి తాను సిద్ధమేనని అంటున్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ప్రస్తుతానికి బ్రిజ్ భూషణ్‌పై రెండు FIRలు నమోదయ్యాయి.