అదంపూర్‌ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. జవాన్లతో ముచ్చట

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం పంజాబ్‌లోని అదంపూర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. ఐఏఎఫ్‌ సిబ్బందితో ఆయన సమావేశం అయ్యారు.

By అంజి
Published on : 13 May 2025 1:04 PM IST

PM Modi, Punjab, Adampur air base, jawans

ఐఏఎఫ్‌ సిబ్బందిని కలిసిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం పంజాబ్‌లోని అదంపూర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. ఐఏఎఫ్‌ సిబ్బందితో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైమానిక దళ సిబ్బంది ఆయనకు స్థావరం వద్ద భద్రతా పరిస్థితి గురించి వివరించారు. ఆపరేషన్‌ సింధూర్‌లో కీలక పాత్ర పోషించారని సిబ్బందిని ప్రధాని ప్రశంసించారు. పాక్‌కు భారత్‌ సత్తా చూపించారని ఆయన కొనియాడారు.

భారతదేశం యొక్క ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిస్పందనగా మే 9-10 రాత్రి పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకున్న నాలుగు కీలకమైన భారత వైమానిక దళ స్టేషన్లలో అదంపూర్ ఒకటి. రాత్రిపూట జరిగిన ప్రతిదాడిలో ఆ స్థావరంపై నష్టం కలిగించిందని పాకిస్తాన్ ప్రకటించిన తర్వాత, ప్రధానమంత్రి మోడీ అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఎక్స్‌ ఖాతాలో ప్రధానమంత్రి జవాన్లతో కొన్ని ఫోటోలను పంచుకున్నారు. దీనిని "చాలా ప్రత్యేకమైన అనుభవం" అని అభివర్ణించారు.

"ఈ రోజు ఉదయం నేను AFS ఆదంపూర్ వెళ్లి మన ధైర్యవంతులైన వైమానిక యోధులను, సైనికులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పం , నిర్భయతకు ప్రతిరూపంగా నిలిచే వారితో ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభవం. మన దేశం కోసం మన సాయుధ దళాలు చేసే ప్రతిదానికీ భారతదేశం వారికి ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటుంది" అని ప్రధానమంత్రి అన్నారు.

ఆపరేషన్లు నిర్వహించిన యుద్ధ విమాన పైలట్లు, సాంకేతిక సహాయక సిబ్బందిని కూడా ప్రధాని మోదీ కలిశారు. వైమానిక యోధులను కలవాలనే కోరికను ప్రధానమంత్రి స్వయంగా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఈరోజు ఉదయం 7 గంటలకు ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ నుండి అదంపూర్ కు బయలుదేరారు. వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆయనతో పాటు ఉన్నారు.

ఆయన వైమానిక దళ సభ్యులతో దాదాపు గంటసేపు గడిపారు. అదంపూర్ వైమానిక స్థావరం వైమానిక దళానికి చెందిన మిగ్ 29 యుద్ధ విమానాలకు స్థావరం.

Next Story