నేటి సాయంత్రం సీఎంలతో ప్రధాని మోదీ కీలక భేటీ
PM Narendra Modi to chair meet with chief ministers today.దేశంలో మరోసారి కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొద్ది
By తోట వంశీ కుమార్ Published on 13 Jan 2022 12:53 PM ISTదేశంలో మరోసారి కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఓ వైపు కరోనా నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దీంతో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తుండగా.. మరికొన్ని చోట్ల వీకెండ్ లాడ్‌డౌన్‌లు పెట్టారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఈ రోజు(గురువారం) సాయంత్రం 4.30గంటలకు వర్చువల్‌గా(వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) ఈ సమావేశం జరగనుంది. దేశంలో కరోనా పరిస్థితిపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాత కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.
ఇక ఈ నెల 9న జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం కొవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్, ఇతర అంశాలపై కీలకంగా చర్చించిన ప్రధాని మోడీ.. జిల్లా స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని, కరోనాకు చెక్ పెట్టేందుకు టీకానే ఉత్తమ మార్గమని పేర్కొన్న విషయం తెలిసిందే.
కాగా నేడు 2,47,417 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,63,17,927కి చేరింది. నిన్న ఒక్క రోజే 380 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4,85,035కి చేరింది. ఒక్క రోజులో 84,825 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,47,15,361కి చేరింది. ప్రస్తుతం దేశంలో 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ కూడా శరవేగంగా వ్యాప్తిస్తోంది. గురువారం ఉదయానికి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 5,488కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1,367మంది ఈ మహమ్మారి బారిన పడగా.. ఆ తరువాత రాజస్థాన్‌లో 792, ఢిల్లీలో 549, కేరళలో 486, కర్ణాటకలో 479 మంది దీని బారిన పడ్డారు. ఇప్పటి వరకు 2,162 మంది కోలుకున్నారు. నిన్న 76లక్షల మందికి టీకా వేశారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 154.61 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.