Video : చరిత్ర సృష్టించిన పారా అథ్లెట్లను కలిసిన‌ ప్రధాని మోదీ

పారిస్ పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారుల‌ బృందం ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది

By Medi Samrat  Published on  12 Sept 2024 3:57 PM IST
Video : చరిత్ర సృష్టించిన పారా అథ్లెట్లను కలిసిన‌ ప్రధాని మోదీ

పారిస్ పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారుల‌ బృందం ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ సరదాగా మాట్లాడుతూ కనిపించారు. చరిత్ర సృష్టించిన క్రీడాకారులను, వారి కోచ్‌లను కొనియాడారు. పారిస్ పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించిన భారత అథ్లెట్లు మంగళవారం దేశానికి చేరుకున్నారు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో 29 పతకాలు సాధించింది. టోక్యో పారాలింపిక్స్ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. టోక్యోలో భారత్ 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 24వ స్థానంలో ఉండగా, పారిస్‌లో భారత్ 18వ స్థానంలో నిలిచింది.

ప్రధాని మోదీతో పాటు క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా, పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పిసిఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝరియా కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. జూడోలో పారాలింపిక్ పతకం సాధించి చరిత్ర సృష్టించిన కపిల్ పర్మార్ ప్రధాని మోదీకి జ్ఞాపికను బహుకరించారు. కపిల్‌కు ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అవని లేఖరా ప్రధాని మోదీకి జెర్సీని బహుమతిగా ఇచ్చింది, అందులో ఆమె త‌న‌కు మద్దతు తెలిపినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపింది. ప్రధాని మోదీ అవని తలపై చేయి వేసి ఆశీర్వదించారు. క్రీడా మంత్రిత్వ శాఖ షేర్‌ చేసిన 43 సెకన్ల వీడియోలో.. పతకం విజేతలతో సంభాషించే ముందు ప్రధాని వారిని అభినందించడం చూడవచ్చు.

ఈసారి భారత్ అత్యధికంగా 84 మంది ఆటగాళ్లతో కూడిన బృందాన్ని పారిస్‌కు పంపింది. దేశానికి తిరిగి వచ్చిన తర్వాత పారాలింపియన్లను ప్రభుత్వం సన్మానించింది. క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన వారికి రూ.75 లక్షలు, రజత విజేతలకు రూ. 50 లక్షలు, కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులకు రూ.30 లక్షలు ఆర్థిక మంత్రి మాండవ్య అందజేశారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో ప్రతిభ కనబరిచిన వారిని రూ.22.5 లక్షలతో సత్కరించారు. వీరిలో రాకేష్ కుమార్‌తో కలిసి కాంస్య పతకాన్ని సాధించిన ఆర్చర్ శీతల్ దేవి ఉన్నారు.

Next Story