శ్రీహరికోట నుంచి అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఈమేరకు ఇస్రో తన అధికారిక ఖాతా ట్విట్టర్‌లో పేర్కొంది. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా అగ్నిబాణ్ రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగించారు. అగ్నిబాణ్ ప్రయోగం విజయవంతమవ్వడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష రంగానికి చాలా ముఖ్యమైన రోజని ప్రధాని మోదీ చెన్నైకి చెందిన అంతరిక్ష స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్‌ను అభినందించారు. యావత్ దేశం గర్వించేలా ఒక అద్భుతమైన ఫీట్ అని ప్రశంసించారు. ప్రపంచంలోని మొట్టమొదటి సింగిల్-పీస్ 3డి ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో నడిచే అగ్నిబాణ్ రాకెట్‌ని విజయవంతంగా ప్రయోగించడం భారతదేశ అంతరిక్ష రంగానికి ఒక కీలక ఘట్టమని ప్రధాని మోదీ అన్నారు.
2017లో ఏరోస్పేస్ ఇంజనీర్లు శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ ఫ్యాకల్టీ సభ్యుడు, ప్రొఫెసర్ సత్యనారాయణ చక్రవర్తితో కలిసి అగ్నికుల్ సంస్థ ను స్థాపించారు. ఈ సంస్థ ఇప్పటి వరకు 40 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తర్వాత అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపిన రెండో భారత కంపెనీగా అగ్నికుల్ చరిత్ర సృష్టించింది.