ప్రధాని మోదీ పుట్టినరోజు.. ఆటో చార్జీల్లో డిస్కౌంట్
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఒక్కరోజు ఆటో చార్జీల్లో డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2023 12:44 PM ISTప్రధాని మోదీ పుట్టినరోజు.. ఆటో చార్జీల్లో డిస్కౌంట్
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న జన్మించారు. ఇవాళ ఆయన 73వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు, బీజేపీ మద్దతు పార్టీల నేతలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలుచోట్ల మోదీ పుట్టినరోజు సందర్భంగా కేక్‌లు కట్ చేస్తున్నారు పార్టీ శ్రేణులు. అయితే.. గుజరాత్‌లో మోదీ పుట్టినరోజు వేళ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఒక్కరోజు చార్జీల్లో డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ బర్త్‌డే సందర్భంగా గుజరాత్‌లో 1000 మంది ఆటో డ్రైవర్లు కలిసి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 17న ఒక్కరోజు ఆటో చార్జీల్లో 30 శాతం తగ్గింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆటో డ్రైవర్లను సూపర్ పశ్చిమ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ (బీజేపీ) అభినందించారు. ఆటో డ్రైవర్ల చార్జీల తగ్గింపు నిర్ణయాన్ని సైతం ఎమ్మెల్యేనే ప్రకటించారు. అంతేకాదు.. నరేంద్ర మోదీ 73వ పుట్టిన రోజు కావడంతో.. మరో 73 మంది ఆటో డ్రైవర్లు పూర్తిగా నూరు శాతం డిస్కౌంట్ ప్రకటించారు. దాంతో.. ప్రయాణికులతో పాటు పలువురు నేతలు ఆటో డ్రైవర్లను అభినందిస్తున్నారు.
మరోవైపు ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ బీజేపీ రెండు వారాల ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. గుజరాత్ లో బీజేపీ ఆధ్వర్యంలో సేవా పఖ్వారా అనే రెండు వారాల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా బీజేపీ కార్యకర్తలు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛత డ్రైవ్‌లు, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు.