ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అస్వస్థతకు గురైయ్యారు. ఆమె ఆరోగ్యం మంగళవారం రాత్రి క్షీణించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ కి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హీరాబెన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు బుధవారం హెల్త్ బులెటెన్‌ను విడుదల చేశారు.
1923 జూన్ 18న హీరాబెన్ జన్మించారు. ఈ ఏడాది వందో పుట్టిన రోజును జరుపుకున్నారు. హీరాబెన్ అస్వస్థతకు గురి కావడంతో ప్రధాని మోదీ సాయంత్రం 4 గంటలకు అహ్మదాబాద్‌కు రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లనున్నారు. ప్రధాని వస్తుండడంతో ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు కొనసాగుతోంది.
ఇప్పటికే సీఎం భూపేంద్ర పటేల్ యూఎస్ మెహతా ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా ఆస్పత్రికి తరలివస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కుటుంబం ప్రయాణిస్తున్న కారు మంగళవారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రహ్లాద్ స్వల్పంగా గాయపడ్డారు.