కుంభమేళాపై ప్రధాని ఏమన్నారంటే..?
PM modi tweets on kumbh mela.దేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో దేశంలో గత
By తోట వంశీ కుమార్ Published on 17 April 2021 6:11 AM GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో మహా కుంభమేళా నిర్వహించడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కుంభమేళాలో పాల్గొన్న సాధువుల్లో అనేక మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుంభమేళాను కుదించేలా చూడాలని మోదీ కోరారు.
ప్రస్తుత మహమ్మారి కఠిన పరిస్థితుల్లో కుంభమేళాను ప్రతీకాత్మకంగా అంటే సింబాలిక్ గా జరపాలంటూ సాధువులను కోరారు. కుంభమేళాలో పాల్గొన్న సాధువుల్లో అనేక మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ జునా అఖాడా హెడ్ స్వామి అవధేశానంద్ గిరితో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సాధువుల ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని.. వారికి ప్రభుత్వం అన్ని విధాలా వైద్యసాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. కుంభమేళాను కుదించేలా చూడాలని మోదీ ఆయనను కోరారు. ఇక కుంభమేళా ప్రాంతంలో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 15 వరకు 2 వేల వందమందికి పైగా భక్తులు వైరస్ బారినపడ్డారు. ఇటీవల షాహీ స్నాన్ సందర్భంగా .. లక్షల సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. కాగా.. కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కుంభమేళాను ఇంకా ముగించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇక.. గడిచిన 24 గంటల్లో దేశంలో 14,95,397 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 2,34,692 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,341 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,75,649కి చేరింది.
నిన్న 1,23,354 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,26,71,220కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,79,740 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటి వరకు మొత్తం 26,49,72,022 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో టీకా ప్రక్రియను వేగవంతం చేశారు. నిన్న 30.04లక్షల మందికి పైగా టీకాలు వేయగా.. ఇప్పటి వరకు టీకాలు పొందిన వారి సంఖ్య 11.99కోట్లు దాటింది.