కరోనా కలకలం.. ప్రధాని మోదీ కీలక సమావేశం
PM Modi To Review Covid-19 Situation At High-Level Meeting Today.కొవిడ్ ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని అధక్ష్యతన
By తోట వంశీ కుమార్ Published on 22 Dec 2022 5:31 AM GMTప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా తన పంజా విసురుతోంది. తగ్గినట్లే తగ్గి కొత్త వేరియంట్ల రూపంలో విలయతాండవం చేస్తోంది. చైనాలో ఇప్పటికే ఉగ్రరూపం దాల్చగా అమెరికా, జపాన్ సహా పలు దేశాల్లో ఆందోళనకర స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం రంగంలోకి దిగారు. దేశంలో కొవిడ్ ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని అధక్ష్యతన గురువారం మధ్యాహ్నాం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
ఇదిలా ఉంటే.. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించిపోలేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. కొత్త వేరియంట్లు వస్తుండడం, పండుగలు సమీపిస్తుండడంతో జాగ్రత్తగా ఉండాలన్నారు.
కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్ 7 రకం చైనాలో విజృంభిస్తోంది. ఈ వేరియంట్ భారత్‌లోనూ వెలుగు చూసింది. ఈ రకానికి చెందని కేసులు నాలుగు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక భారత్‌లో ప్రస్తుతం కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 185 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,402 యాక్టివ్ కేసులు ఉన్నాయి.