క‌రోనా ప‌రిస్థితుల‌పై నేడు ప్ర‌ధాని మోదీ కీల‌క భేటి

PM Modi To Hold Meeting today On Covid Situation.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి పంజా విసురుతోంది. దీంతో గ‌త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jan 2022 12:30 PM IST
క‌రోనా ప‌రిస్థితుల‌పై నేడు ప్ర‌ధాని మోదీ కీల‌క భేటి

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి పంజా విసురుతోంది. దీంతో గ‌త కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కార‌ణంగా మూడో వేవ్ వ్యాపించింద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డిపై ప్ర‌ధానంగా దృష్టిసారింది. ఈ నేప‌థ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేటి(ఆదివారం) సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటిలో వైద్య ఆరోగ్య శాఖ‌, హోంశాఖ ఉన్న‌తాధికారుల‌తో పాటు నీతి ఆయోగ్ స‌భ్యులు పాల్గొన‌నున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సాయంత్రం 4.30 గంటలకు ఈ స‌మీక్షా స‌మావేశం జ‌ర‌గ‌నుంది. చివరిగా ప్ర‌ధాని గతేడాది డిసెంబర్ 24న కరోనాపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

నేటి సాయంత్రం నిర్వ‌హించనున్న భేటిలో దేశంలో కరోనా ప‌రిస్థితులు ఎలా ఉన్నాయి ? క‌రోనా క‌ట్ట‌డి రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాయి? వ్యాక్సినేషన్‌ను వేగ‌వంతం చేయ‌డం? ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఔషధాలు, ఆక్సిజన్ తదితర అంశాలపై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. ప‌రిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు మ‌రోసారి లాక్‌డౌన్ విధించే అవ‌కాశం ఉంది. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను పెట్టే అవ‌కాశాలు త‌క్కువ అని నిపుణులు చెబుతున్నారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 1,59,632 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,55,28,004 కి చేరింది. నిన్న ఒక్క రోజే 327 మంది మృతి చెందారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన‌ వారి సంఖ్య 4,83,790కి చేరింది. నిన్న 40,863 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,44,53,603కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 5,90,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ కూడా శ‌ర‌వేగంగా వ్యాప్తిస్తోంది. ఆదివారం ఉద‌యానికి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 3,623కి చేరింది.

Next Story