టీకాతో.. 40 కోట్ల మంది బాహుబలులయ్యారు : ప్రధాని మోదీ
PM Modi says those who take vaccine shot in Baahu become Baahubali.కరోనా నిబంధనల మధ్య నేటి నుంచి
By తోట వంశీ కుమార్ Published on 19 July 2021 6:33 AM GMT
కరోనా నిబంధనల మధ్య నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా టీకా ప్రాముఖ్యతను వివరించారు. టీకాలను భుజాలకు ఇస్తారని, అయితే కోవిడ్ టీకాలను వేయించుకున్నవాళ్లు బాహుబలులు అయినట్లు ప్రధాని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకుని ఉంటారని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని, దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది కోవిడ్ టీకా తీసుకున్నారని, వాళ్లంతా బాహుబలులు అయినట్లు ఆయన తెలిపారు.
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని, ప్రతి ఒక్క సీఎంతో తాను చర్చించానన్నారు. ప్రపంచం అంతా మహమ్మారితో సతమతం అయ్యిందని, పార్లమెంట్‌లో ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. ప్రతి ఒక పార్టీకి చెందిన ఎంపీలు అత్యంత కఠినమై ప్రశ్నలు వేయాలని, కానీ ఆ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చేలా అనుమతించాలన్నారు. క్రమశిక్షణ వాతావరణంలో సమావేశాలు సాగాలన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. దీని వల్ల ప్రజల్లో నమ్మకం కలిగి, అభివృద్ధి వేగవంతం అవుతుందని మోదీ తెలిపారు.
సోమవారం నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకోంటొంది. ఇక ఈ సమావేశాల్లో కొత్త కేబినెట్ మంత్రులను ప్రధాని మోదీ ఉభయసభలకు పరిచయం చేయనున్నారు. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుకు 31 అంశాలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 29 బిల్లులు, 2 ఆర్థిక అంశాలను కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకురానున్నది. అలాగే.. ఆరు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టనున్నది కేంద్రం.