ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. విధ్వంసకర శక్తుల రాజ్యం కొన్నాళ్లే
PM Modi says Destructive forces can dominate for some time.భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 21 Aug 2021 2:58 AM GMTభారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విధ్వంసకర శక్తులు, తీవ్రవాద శక్తులు కొన్నాళ్లు మాత్రమే రాజ్యం చెలాయిస్తాయని, అవి శాశ్వతంగా మనుగడ సాగించలేవని ప్రధాని తెలిపారు. తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తరుణంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాంటివారు మానవజాతిని ఎన్నటికీ అణచివేయలేరని అందుకే వారి ఉనికి శాశ్వతం కాదని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సోమ్‌నాథ్ ఆలయం ఎన్నోసార్లు విధ్వంసానికి గురయ్యింది. విగ్రహాలను కూడా చాలా సార్లు అపవిత్రం చేశారు. ఆలయ ఉనికిని నాశనం చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఇలా దాడులు జరిగిన ప్రతిసారీ సోమ్‌నాథ్ ఆలయం మరింత వైభవాన్ని సాధించింది. ఈ ఆలయం కాలం పెట్టిన పరీక్షలను, కుటీల ప్రయత్నాలను జయించింది. ఇప్పటికీ నిలబడే ఉన్నది. విధ్వంస భావజాలంతో సామ్రాజ్యాలను స్థాపించుకొనే శక్తులు కొన్నాళ్లు మాత్రమే ఆధిపత్యం చెలాయించగలవు. వాటి ఉనికి శాశ్వతం కాదు. మానవత్వాన్ని అవి ఎల్లకాలం అణిచివేయలేవు. ఈ విశ్వాసాన్ని, భరోసాను ప్రపంచానికి సోమ్‌నాథ్ అందిస్తోందని ప్రధాని మోదీ అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పార్వతీ ఆలయానికి కూడా శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.47 కోట్లతో ఈ పునర్నిర్మాణ పనులను చేపట్టారు. పురాతన సోమ్ నాథ్ కట్టడాలకు ఆధునిక హంగులను అద్దుతూ ప్రదర్శనశాలను సుందరంగా తయారు చేశారు. సోమ్ నాథ్ రినోవేటెడ్ టెంపుల్ కాంప్లెక్స్ ఓల్డ్ (జునా)ను శ్రీ సోమ్ నాథ్ ట్రస్ట్ రూ.3.5 కోట్లతో పూర్తి చేసింది. దీనిని అలీభాయ్ మందిరంగా పిలుస్తారు. రాణి అలీభాయ్ నిర్మించిన కారణంగా ఈ పేరు వచ్చింది.
ఇదిలాఉంటే.. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు తమ అరాచకాన్ని కొనసాగిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తోన్న వారిపై కాల్పులకు తెగబడుతున్నారు. అంతేకాకుండా మహిళలు స్వేచ్ఛగా బయటకు వచ్చి వారి విధులు నిర్వర్తించకుండా అడ్డుపడుతున్నారనే నివేదికలు వస్తున్నాయి. ఇలా అఫ్గాన్ ప్రజలపై తాలిబన్ల అరాచకాలు మళ్లీ మొదలైనట్లు వస్తోన్న వార్తలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.