నేడు వైశాఖ పూర్ణిమ. దీనినే మహా వైశాఖి, బుద్ధ పూర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజున గౌతమ బుద్దుడు జన్మించాడని, ఇదే రోజున జ్ఞానోదయం కూడా పొందాడని చెబుతారు. అయితే దేశంలో కరోనా రెండో దశ కల్లోలం కొనసాగుతున్న వేళ బుద్ధ పూర్ణిమ వేడుకల్లో వర్చ్యువల్ గా పాల్గొన్నారు ప్రధాని మోడీ.
అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యతో కలిసి కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వర్చువల్‌గా పాల్గొన్నారు ప్రధాని. ట్రిపుల్-బ్లెస్డ్ డే గానూ పరిగణించే ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సంఘాల అత్యున్నత అధిపతులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ కరోనాపై పోరాటంలో వ్యక్తిగతంగా, సంస్థలపరంగా ఎందరో సేవలందరించారని, వీరంతా బుద్ధుని బోధలను తమ ఆచరణలో చూపించారని అన్నారు. ప్రపంచం ఈ శతాబ్ధంలో ఇలాంటి అంటువ్యాధిని చూసి ఉండదన్నారు. ప్రపంచం ఇక కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్లుగానే ఉండబోంతోందని వ్యాఖ్యానించారు. కరోనాను అంతం చేయాలంటే వ్యాక్సిన్లదే కీలక పాత్ర అన్న ప్రధాని ఈ సందర్భంగా మరోసారి కోవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.
కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తున్నా బెదరక తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి నిస్వార్థ సేవలు అందించిన ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లు, వైద్యులు, నర్సులకు తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు. కరోనా ను జయించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని, అటువంటి వ్యాక్సిన్ల తయారీ కోసం కృషి చేసిన మన శాస్త్రవేత్తలు దేశానికే గర్వకారణం అని ప్రధాని అన్నారు.