వాళ్లు సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చూస్తున్నారు: మోదీ

ప్రతిపక్ష ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలని భావిస్తోందని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  14 Sep 2023 8:02 AM GMT
PM Modi, Sanatan Dharma, Madhya Pradesh, udhayanidhi,

వాళ్లు సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చూస్తున్నారు: మోదీ

డీఎంకే నేత, తమిళనాడు సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఆయన కామెంట్స్ చేశారు. దాంతో ఉదయనిధి స్టాలిన్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఈ క్రమంలో కొందరు మాత్రమే ఉదయనిధిని సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించారు. మధ్యప్రదేశ్‌లోని బీనాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని.. సనాతన ధర్మంపై జరుగుతున్న వివాదం గురించి స్పందించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలని భావిస్తోందని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు.

సనాతన ధర్మం స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్ వంటి వారికి స్పూర్తినిచ్చిందని చెప్పారు ప్రధాని మోదీ. ఎన్డీఏ కూటమి సనాతన ధర్మాన్ని తుడిచేయాలని అనుకుంటోందని ఆరోపించారు. బహిరంగంగా సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారని, రేపు మనపై కూడా దాడులను పెంచుతారని అన్నారు. మరో వెయ్యేళ్లు బానిసత్వం వైపు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దేశాన్ని ప్రేమించే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారిని అరికట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఇక మధ్యప్రదేశ్‌లో ఎక్కువ కాలం పాలన సాగించిన పార్టీ కాంగ్రెస్‌ అని.. అక్కడ అవినీతి, నేరాలు తప్ప ఏం జరగలేదని విమర్శించారు ప్రధాని మోదీ. జీ20 సదస్సు విజయవంతం అయ్యిందని.. ఈ ఘనత దేశ ప్రజలందరికీ దక్కుతుందని అన్నారు. నాలో రిఫైనరీలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడంలో దోహదపడుతుందని.. ఆధునిక పెట్రోకెమికల్ కాంప్లెక్స్ బీనాను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందన్నారు మోదీ. రూ.50వేల కోట్ల ప్రాజెక్టులను మధ్యప్రదేశ్‌లో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజలను కలిసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story