జేపీ నడ్డాపై ప్రధాని మోదీ ప్రశంసలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 12:27 PM ISTజేపీ నడ్డాపై ప్రధాని మోదీ ప్రశంసలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కృషిని కొనియాడారు. ఆయన వ్యవమరించిన తీరు ఎంతో బాగుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం కోసం జేపీ నడ్డా చూపించిన నాయకత్వ లక్షణాలు, నిరంతరం ఆయన పడ్డ శ్రమ వచ్చిన ఫలితాల్లో కనిపించాయని మోదీ చెప్పారు. జేపీ నడ్డా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేయడమే కాదు.. ఆయా రాష్ట్రాల్లో పార్టీ గెలుపు కోసం వ్యూహాలను కూడా రచించారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కూడా చురుగ్గా పాల్గొన్నట్లు తెలిపారు. అయితే.. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలోనే నడ్డా కుటుంబానికి చెందిన బంధువుల్లో ఒకరు చనిపోయారనీ... అయినా ఆయన ఆ బాధను దిగమింగుకుని పార్టీ కోసం అహర్నిషలు కష్టపడ్డారని ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. జేపీ నడ్డా రచించిన వ్యూహాలే మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపునకు సహకరించాయని మోదీ అన్నారు. బీజేపీ విజయం కోసం నడ్డా పూర్తిస్తాయిలో పట్టుదలతో అన్నీ పక్కన పెట్టి కృషి చేశారని మోదీ పేర్కొన్నారు.
బీజేపీ నిర్వహించిన విజయ ర్యాలీలో పాల్గొన్న జేపీ నడ్డా మాట్లాడుతూ.. దేశంలో హామీ ఉందంటే.. అది మోదీ హామీ మాత్రమే అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి దూసుకెళ్తుందని చెప్పుకొచ్చారు. అలాగే తాము మోదీ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మోదీ చరిష్మాతోనే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.