స్వాతంత్య్రానికి ముందు చేసిన చట్టాల్లో మార్పులు తీసుకురావడంపై రాష్ట్రాలు ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పోలీసుల కోసం 'ఒక దేశం, ఒకే యూనిఫాం' కోసం పిలుపునిచ్చారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అంతర్గత భద్రతకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న ఎంహెచ్‌ఏ చింతన్ శివిర్ సందర్భంగా మోదీ మాట్లాడారు. అన్ని రాష్ట్రాలు వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ తరహాలో పోలీసు యూనిఫామ్‌లకు ఏదైనా చేయడం గురించి ఆలోచించాలని అన్నారు.
"ఇది నాణ్యమైన ఉత్పత్తిని, పోలీసులను సులభంగా గుర్తించేలా చేస్తుంది. దీనికి సమయం పట్టినప్పటికీ, ఈ ఆలోచనను చర్చించాలి." అని అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. ఇటీవలి సంవత్సరాలలో అనేక చట్ట సంస్కరణలు వచ్చాయని, ఇవి దేశంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో దోహదపడ్డాయని అన్నారు. "అదే సమయంలో వాణిజ్యం, వ్యాపారానికి సంబంధించిన అనేక నిబంధనలు క్రిమినల్ కేటగిరీ నుండి తొలగించబడ్డాయి.
ప్రభుత్వం 1,500 కంటే ఎక్కువ పాత చట్టాలను రద్దు చేయడం ద్వారా భవిష్యత్తు భారాన్ని కూడా తగ్గించింది" అని మోడీ పేర్కొన్నారు. యుఎపిఎ వంటి చట్టాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యవస్థలకు బలాన్నిచ్చాయని ఆయన అన్నారు. దేశంలో నక్సలిజం ఏ రూపంలో ఉన్నా దాని అంతు చూడాల్సిందేనని ప్రధాని మోదీ అన్నారు. నక్సల్స్ గన్నులు పట్టుకోగలరు, పెన్నులు పట్టుకోగలరని... యువతను పక్కదోవ పట్టించగలరని చెప్పారు. సోషల్ మీడియాను తక్కువగా అంచనా వేయొద్దని.. తప్పుడు వార్తలతో ప్రజలను గందరగోళానికి గురి చేసే శక్తి సోషల్ మీడియాకు ఉందని అన్నారు.