రాత్రి పూట వీధుల్లో తిరిగిన ప్రధాని మోదీ

PM Modi midnight inspection development works Varanasi.ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సోమ‌వారం రాత్రి వార‌ణాసి వీధుల్లో

By M.S.R  Published on  14 Dec 2021 9:14 AM GMT
రాత్రి పూట వీధుల్లో తిరిగిన ప్రధాని మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సోమ‌వారం రాత్రి వార‌ణాసి వీధుల్లో న‌డుచుకుంటూ తిరిగారు. అర్థ‌రాత్రి 12.30 గంట‌ల‌కు ఆయ‌న సంత్ ర‌విదాస్ ఘాట్ నుంచి బ‌య‌లుదేరి గొదౌలియా కూడ‌లికి చేరుకున్నారు. అక్క‌డి నుంచి ప్ర‌ధాని మోదీ విశ్వ‌నాథ్ కారిడార్ చేరుకొని అక్క‌డ జ‌రుగుతున్న‌ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ కూడా మోదీతో కలిసి తిరిగారు. దాదాపు 20 నిమిషాల‌పాటు ప్ర‌ధాని అక్క‌డే గ‌డిపారు. ఆ త‌రువాత రైలు మార్గాన త‌న గెస్ట్ హౌస్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. "కాశీలో అభివృద్ధి ప‌నులకు సంబంధించి త‌నిఖీ చేయ‌డం జరిగింది. కాశీ లాంటి ప‌విత్ర న‌గరానికి దేశంలోనే మెరుగైన ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అందించేందుకు ప్రభుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ పుణ్య‌క్షేత్రానికి వ‌చ్చే భ‌క్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని రైల్వే క‌నెక్టివిటీ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి" అని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

ప్రధాని మోదీ సోమవారం నాడు వారణాసి పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి వార‌ణాసికి చేరుకున్న‌ మోదీకి స్వాగ‌తం ప‌లుకుతూ అక్క‌డి ప్ర‌జ‌లు ఆయ‌న‌పై పూల వ‌ర్షం కురిపించారు. కాశీ గంగా న‌దిలో మోదీ పుణ్య‌స్నానం ఆచ‌రించారు. గంగా న‌దిలో క‌ల‌శంతో పుష్పాలు వ‌దిలారు. ల‌లితా ఘాట్ వ‌ద్ద మోదీ జ‌ల‌త‌ర్ప‌ణం చేశారు. గంగా మాత‌కు పుష్పాలు అర్పించారు. సూర్య భ‌గ‌వానుడికి పూజ‌లు చేశారు. కాషాయ వ‌స్త్రాల్లో.. గంగా జ‌లాన్ని తీసుకుని ఆయ‌న బాబా విశ్వ‌నాథుడి వ‌ద్ద‌కు వెళ్లారు. కాశీ చేరుకున్న ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలభైరవుడికి హారతి ఇచ్చారు. ఆయన ర్యాలీగా వస్తుండగా ఆయనను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఓ వ్యక్తి.. ప్రధాని మోదీకి తలపాగా, శాలువా బహుకరించేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అది గమనించిన ప్రధాని మోదీ.. భద్రతా సిబ్బందికి సర్దిచెప్పి.. ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచారు. అతని నుంచి తలపాగా, శాలువా స్వీకరించి ధన్యవాదాలు తెలిపారు.

Next Story