భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ' పేరుతో వేడుకలను నిర్వహిస్తోంది. తాజాగా ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు దేశ ప్రజలందరూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్చర్‌గా జాతీయ జెండా ఫొటో పెట్టుకోవాలని ప్రధాని మోదీ కోరారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుక ఉద్యమంగా మారడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఉన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ వేడుకలో ఏదో రూపంలో పాల్గొంటున్నారని అన్నారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షహీద్ ఉధమ్ సింగ్‌కు ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు 'హర్ ఘర్ తిరంగా' పేరుతో ప్రత్యేక ఉద్యమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ మూడ్రోజులు దేశంలోని ప్రతి ఇంటి వద్ద జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలన్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో మనందరం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక ఘట్టాన్ని చూడబోతున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆటబొమ్మల ఎగుమతిలో ఇండియా పవర్‌హౌస్‌గా మారుతోందని మోదీ అన్నారు.
బొమ్మల ఎగుమతి రూ.300-400 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు చేరిందని చేరిందన్నారు. భారతీయ పురాణాలు, చరిత్ర, సంస్కృతి ఆధారంగా తయారీదారులు ఇప్పుడు ఆట బొమ్మలను తయారు చేస్తున్నారని చెప్పారు. వాటి నుంచి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారని మోదీ తెలిపారు. త్రివర్ణ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కూడా ఆగస్టు 2నే అని గుర్తు చేస్తూ, ఆయనకు నివాళులర్పించారు. మువ్వన్నెల జెండా రూపకల్పనలో మేడం కామా కూడా కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు.