ప్ర‌ధాన మంత్రుల మ్యూజియాన్ని ప్రారంభించిన మోదీ

PM Modi inaugurates Pradhan Mantri Sangrahalaya.దేశానికి సేవలందించిన 14 మంది ప్రధాన మంత్రుల జీవిత విశేషాలతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 April 2022 4:03 PM IST
ప్ర‌ధాన మంత్రుల మ్యూజియాన్ని ప్రారంభించిన మోదీ

దేశానికి సేవలందించిన 14 మంది ప్రధాన మంత్రుల జీవిత విశేషాలతో న్యూఢిల్లీలో కొత్త‌గా ఏర్పాటు చేసిన 'ప్ర‌ధాన మంత్రి సంగ్ర‌హాల‌య' ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. అంతేకాదు.. తొలి టికెట్‌ను ఆయ‌నే కొనుగోలు చేసి ఈ మ్యూజియాన్ని సంద‌ర్శించారు. ఈ మ్యూజియంలో 14 మంది ప్ర‌ధానుల చ‌రిత్ర ఉంటుంది. దేశాన్ని వాళ్లు ఎలా న‌డిపారు..? వారి జీవితాల్లోని అనుభ‌వాలు, ఎదురైన స‌వాళ్లు వంటి విష‌యాలు అన్ని ఈ మ్యూజియంలో ఉన్నాయి.

75 ఏళ్ల‌ స్వతంత్ర భారత్ ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ మ్యూజియంను ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని తీన్ మూర్తి ఎస్టేట్ లో 15,600 చదరపు మీటర్ల వైశాల్యంతో రెండు బ్లాకులు, 43 గ్యాలరీలతో ఈ సంగ్రహాలయాన్ని నిర్మించారు. రైజింగ్ ఇండియా కథ స్ఫూర్తిగా ఈ మ్యూజియానికి డిజైన్ చేశారు. అభివృద్ధి చెందుతున్న భార‌త్ ను ప్రేర‌ణ‌గా తీసుకొని, ఈ భ‌వ‌న నిర్మాణం ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ఈ భవనం లోగో దేశం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా "చక్రం" పట్టుకున్న భారతదేశ ప్రజల చేతులను సూచిస్తుంది. కాగా.. ఇంత‌టి మ్యూజియం నిర్మించే స‌మ‌యంలో ఒక్క చెట్టును కూడా న‌రికేయ‌లేదు.

పార్టీల‌క‌తీతంగా దేశాన్ని పాలించిన ప్ర‌ధానులంద‌రి సేవ‌ల్ని గుర్తించ‌డ‌మే సంగ్ర‌హాల‌యం ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని అధికారులు చెప్పారు. భార‌త తొలి ప్ర‌ధాని నెహ్రూ జీవితం, ఆయ‌న దేశానికి చేసిన సేవ‌ల‌కు సంబంధించి ఓ డిస్‌ప్లేను కూడా ఉంచారు. అలాగే ప్ర‌పంచ వ్యాప్తంగా నెహ్రూకు వ‌చ్చిన బ‌హుమ‌తుల‌ను కూడా ఈ మ్యూజియంలో ఉంచారు. భారత పౌరులకు ప్రధానమంత్రి సంగ్రహాలయ ప్రవేశానికి ఆన్‌లైన్ టిక్కెట్ ధర రూ.100 కాగా, ఆఫ్‌లైన్ టికెట్ ధర రూ.110. విదేశీయులకు టిక్కెట్ ధరను రూ.750గా నిర్దేశించారు.

Next Story