ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని ద్వారక వద్ద అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ 'సుదర్శన సేతు'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడి ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. నీట మునిగిన ద్వారకను సందర్శించేందుకు ప్రధాని మోదీ ఆక్సిజన్ మాస్కు పెట్టుకుని సముద్ర జలాల్లోకి దిగారు. "అగాధ జలాల్లో మునిగి ఉన్న ద్వారకా నగరిలో ప్రార్థనలు జరిపేందుకు వెళ్లడం ఒక దివ్యమైన అనుభూతిని కలిగించింది. ప్రాచీన కాలం నాటి ఆధ్యాత్మిక వైభవానికి, కాలాతీత భక్తిభావానికి నేను అనుసంధానించబడ్డానన్న భావన కలిగింది. భగవాన్ శ్రీకృష్ణుడి దీవెనలు అందరికీ లభించాలి" అంటూ మోదీ ట్వీట్ చేశారు.
ద్వారక తీరంలో స్కూబా డైవింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ ప్రజలు పురాతన ద్వారక అవశేషాలను నీటిలో చూడవచ్చు. ఈరోజు తెల్లవారుజామున ప్రధాని మోదీ కూడా ద్వారకలోని శ్రీకృష్ణుని ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పంచకుయ్ బీచ్‌లో అరేబియా సముద్ర తీరంలో నీటి అడుగున వెళ్లి స్కూబా డైవింగ్‌ను ఆస్వాదించారు. నీటిలో మునిగి ఉన్న ద్వారకలో ప్రార్ధనలు చేసిన ప్రధాని మోదీ దీనిని 'చాలా దివ్యమైన అనుభవం' అని పేర్కొన్నారు.