బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోయడమే వారి లక్ష్యం: ప్రధాని మోదీ

ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  19 Dec 2023 6:55 AM GMT
pm modi,  opposition, parliament, delhi,

బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోయడమే వారి లక్ష్యం: ప్రధాని మోదీ

ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఉజ్వల భవిష్యత్‌ను అందించడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కానీ.. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్‌ను కూలదోయడమే ఇండియా కూటమి లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రతిపక్షాల వ్యవహార శైలి ఏమాత్రం సరికాదని అన్నారు.

పార్లమెంట్‌లో ఇటీవల భద్రతా వైఫల్యం సంఘటన గురించి పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈ భద్రతా ఉల్లంఘటనను ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలి.. కానీ ప్రతిపక్షాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మోదీ అన్నారు. ప్రతిపక్షాల తీరు దేశ ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ప్రవర్తన కారణంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వారి సీట్ల సంఖ్య మరింత తగ్గి.. బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ దీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షం తీవ్ర నిరాశకు గురైందని అన్నారు. అందుకే పార్లమెంట్‌ నిర్వహణకు అడ్డుపడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోయడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని ప్రధాని మోదీ ఎంపీలతో చెప్పినట్లు పార్లమెంటరీ వ్యవహారల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మీడియాకు చెప్పారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ పలు సూచనలు చేశారని అన్నారు.

ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు మర్యాదపూర్వకంగానే స్పందించాలని మోదీ చెప్పారన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచాలని ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టాలనీ.. సమావేశాల అనంతరం ఎంపీలు సరిహద్దు గ్రామాల్లో పర్యటించాలని ప్రధాని మోదీ కోరినట్లు ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు.

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. దాంతో.. ఉభయ సభల్లోనూ గందరగోళ పరిస్థితులు కొనసాగాయి. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారనీ.. లోక్‌సభలో 33 మంది, రాజ్యసభలో 45 మందిని సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యచరణపై ఇండియా కూటమి నేతలతో కాంగ్రెస్ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే చర్చిస్తున్నారు.

Next Story