పవన్ రికార్డును బ్రేక్ చేసిన ప్రధాని మోదీ.. 8,931 రోజులుగా అధికారంలో!
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రస్థానంలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
By - అంజి |
పవన్ రికార్డును బ్రేక్ చేసిన ప్రధాని మోదీ.. 8,931 రోజులుగా అధికారంలో!
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రస్థానంలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఒక ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక రోజులు అధిపతిగా వ్యవహరించిన నాయకుడిగా ఆయన రికార్డు పుటల్లోకి ఎక్కారు. ముఖ్యమంత్రిగా మరియు ప్రధానమంత్రిగా కలిపి మోదీ ఇప్పటివరకు 8,931 రోజులు పదవిలో కొనసాగారు. ఇప్పటివరకు ఈ రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. ఆయన 8,930 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజాగా ఆ రికార్డును ప్రధాని మోదీ అధిగమించారు.
గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు:
అక్టోబర్ 7, 2001: మోదీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గుజరాత్ సీఎంగా 13 ఏళ్లకు పైగా పనిచేసి, అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న వ్యక్తిగా నిలిచారు. ఆ తర్వాత మే 26, 2014న భారత 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019, 2024 సాధారణ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి, పూర్తి మెజారిటీతో మూడుసార్లు ప్రధాని అయిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా నిలిచారు.
ప్రధాని మోదీ సాధించిన ఈ అరుదైన ఘనత నేపథ్యంలో ఎన్డీయే కూటమి నేతలు, కేంద్ర మంత్రులు మోదీకి అభినందనలు తెలిపారు. "మోదీ దశాబ్దాల సేవ ఒక నూతన శకాన్ని సృష్టించింది. పేదల హక్కుల నుంచి ప్రపంచ వేదికపై భారత ఖ్యాతి వరకు మోదీ హయాంలో దేశం ఊహించని మార్పులు చూసింది" అని కేంద్రమంత్రి అమిత్ షా కొనియాడారు. ప్రధాని మోదీ అంకితభావం, దార్శనికత దేశ ప్రగతికి బాటలు వేశాయని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 145 కోట్ల భారతీయుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న 'అమృత కాల సారథి' అని మోదీని యూపీ సీఎం యోగి అభివర్ణించారు.