రైతులకు గుడ్‌న్యూస్.. ఎల్లుండే పీఎం కిసాన్ నిధుల విడుదల.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారం అస్సాంలోని గౌహతి వేదికగా పీఎం-కిసాన్ (PM-Kisan) పథకం 22వ విడత నిధులను విడుదల చేయనున్నారు.
By - అంజి |
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారం అస్సాంలోని గౌహతి వేదికగా పీఎం-కిసాన్ (PM-Kisan) పథకం 22వ విడత నిధులను విడుదల చేయనున్నారు. మార్చి 13, 2026న నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా ఈ నగదు జమ అవుతుంది. గతంలో 21వ విడత నిధులను నవంబర్ 19, 2025న తమిళనాడులోని కోయంబత్తూరులో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. దీనిని మూడు సమాన విడతల్లో అందజేస్తారు. రైతులు తమ వ్యవసాయ అవసరాలైన విత్తనాలు, ఎరువులు, ఇతర పరికరాల కొనుగోలుకు ఈ నగదును ఉపయోగించుకోవచ్చు.
లబ్ధిదారుల జాబితాను ఎలా తనిఖీ చేయాలి?
రైతులు తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించవచ్చు:
అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in సందర్శించండి.
హోమ్ పేజీలో ‘Farmers Corner’ విభాగానికి వెళ్లండి.
అక్కడ ‘Beneficiary List’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్ , గ్రామం వివరాలను ఎంపిక చేసి ‘Get Report’ పై క్లిక్ చేస్తే జాబితా కనిపిస్తుంది.
వీరికి నగదు అందదు
కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం కొంతమందిని ఈ జాబితా నుండి మినహాయించింది. ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమిని కొనుగోలు చేసిన వారు, ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్న వారు (భార్యాభర్తలు ఇద్దరూ పొందడం వంటివి) ప్రస్తుతం నిలిపివేయబడ్డారు. వీరికి భౌతిక ధృవీకరణ పూర్తయిన తర్వాతే నగదు అందుతుంది.
ఫార్మర్ ఐడి తప్పనిసరి
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, తమిళనాడు సహా 14 రాష్ట్రాల్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే రైతులకు ఫార్మర్ ఐడి (Farmer ID) తప్పనిసరి చేయబడింది. రైతు రిజిస్ట్రీ పనులు ప్రారంభమైన రాష్ట్రాల్లో మాత్రమే ఇది వర్తిస్తుంది, ఇతర రాష్ట్రాల్లో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది.