ద‌క్షిణాదిన ప‌రుగులు పెట్టిన వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు

PM Flags Off South's First Semi-High Speed Vande Bharat Express.ద‌క్షిణ భార‌త దేశంలో తొలి వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Nov 2022 7:23 AM GMT
ద‌క్షిణాదిన ప‌రుగులు పెట్టిన వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు

ద‌క్షిణ భార‌త దేశంలో తొలి వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు కూత పెట్టింది. శుక్రవారం కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్ లో మైసూర్‌-చెన్నై మార్గంలో న‌డ‌వ‌నున్న వందే భార‌త్ రైలును ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశంలో ఇది ఐదో వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు కాగా.. ద‌క్షిణ భార‌త దేశంలో మొద‌టిది.

దీనితో పాటు భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఇది యాత్రికుల కోసం న‌డ‌నున్న రైలు. ఎనిమిది రోజుల టూర్ ప్యాకేజీ ఉండే ఈ రైలులో వార‌ణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి ప‌విత్ర స్థ‌లాల‌ను ద‌ర్శించుకోవ‌చ్చు.

వందే భారత్ రైలు.. చెన్నై-మైసూర్ మార్గంలో బుధవారం మినహా ప్రతి రోజు న‌డ‌వ‌నుంది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లో ఉన్నాయి. అందులో 14 చైర్ కార్స్, 2 ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్స్ ఉంటాయి. ఏసీ చైర్ కార్‌లో చెన్నై నుంచి మైసూరుకు రూ.1200, ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్‌కు రూ.2295 ఛార్జీ చెల్లించాలి. మైసూర్ నుంచి చెన్నైకి ఏసీ చైర్ కార్‌లో రూ.1365, ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్‌ ప్రయాణానికి రూ.2485 ఛార్జీ చెల్లించాలి.

బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి త‌దిత‌రులు ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌లికిన వారిలో ఉన్నారు.

తొలుత ప్ర‌ధాని.. క‌వి క‌న‌క‌దాస జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న విగ్ర‌హానికి నివాళుల‌ర్పించారు. ఆ త‌రువాత మ‌హ‌ర్షి వాల్మికి విగ్ర‌హాన్ని సంద‌ర్శించారు. అనంత‌రం వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో మోదీ బెంగళూరులోని దాదాపు రూ.5 వేల కోట్లతో నిర్మించిన కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2ను ప్రారంభించ‌ను్న‌నారు. 108 అడుగుల ఎత్తైన నాద ప్ర‌భు కెంపెగౌడ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు.

Next Story